ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ప్రత్యేక చట్టం తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. వరదలు తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున స్టాక్ యార్డులకు తరలించి ఎక్కడా కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు ఖరారు చేసి పక్కాగా అమలు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఇసుక సరఫరా పెంపు, మద్యం నియంత్రణపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో చర్చించి ఇసుక ధరలు ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సరఫరా పెంచాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈసారి ‘స్పందన’ ఇసుకపైనే..
‘ఎక్కడా అవినీతికి తావులేకుండా వ్యవహరిస్తున్నప్పటికీ విపక్షాలు మనపై బండలు వేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. వచ్చే వారం ‘స్పందన’ నాటికి ఇసుక ధరలతోపాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రకటించాలి. ఈసారి ‘స్పందన’ కేవలం ఇసుకపైనే నిర్వహిస్తాం. అదే వేదికగా ఇసుక వారోత్సవాలను ప్రకటిస్తాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
సీఎం సమీక్షలో కీలక అంశాలివీ..
– ఇసుక స్మగ్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచి టెక్నాలజీని వినియోగించుకోవాలి.
– ప్రతి రూట్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలి.
– తప్పు చేసిన వారిని జైలుకు పంపితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది.
– ప్రతి రీచ్‌లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా చూడగలగాలి. తవ్వకాలు నిలిచిపోతే వెంటనే కారణం తెలియాలి.
– మొత్తం 275 రీచ్‌లలో రాత్రి పూట కూడా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
– రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు సిద్ధం కావాలి. జాప్యాన్ని నివారించేందుకు వేర్వేరు సంస్థల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలి.
– వరద తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా కోసం వాహనాలను విస్తృతంగా అందుబాటులో ఉంచాలి.
– కిలోమీటరుకు టన్ను రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వెంటనే అనుమతి ఇవ్వాలి.
– స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు సరిపడా చేరేవరకు విరామం లేకుండా పనిచేయాలి.
– అవసరమైతే స్టాక్ పాయింట్లు పెంచాలి. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఇసుక సరఫరా చేయాలి.