క్షేత్రస్థాయి సమాచారంతో రూపొందించిన వ్యూహాలతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆ గెలుపు కూడా సామాన్యమైంది కాదు. 151 సీట్లు గెలుచుకుని 40 ఏళ్ల రాజకీయ అనుభవం, మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింది. సాధారణ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం స్థానిక సంస్థల్లోనూ సీఎం జగన్ అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల పదవుల్లో 90 శాతం వైఎస్సార్సీపీయే గెలుచుకోవాలనే పట్టుదలతో సీఎం జగన్ కనిపిస్తున్నారు. ఈ బాధ్యతను జిల్లా ఇన్చార్జి మంత్రులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించినా.. తాను చేయాల్సిన పని చేస్తున్నారు. పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆధారపడకుండా తానంటూ ఒక వ్యూహాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. జయపజయాలు పోటీ చేసే అభ్యర్థులపై ఆధారపడి ఉంటాయి. ఆ తర్వాతే ఇతర అంశాలు ప్రభావితం చేస్తాయి. గత ఎన్నికల్లోనూ ఇదే ఫార్మలాను అమలు చేసిన సీఎం జగన్ తన సహజశైలికి భిన్నంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. 2014లో చేసిన పొరపాటును ఈసారి రిపీట్ చేయలేదు. పలు సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించారు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వనున్నట్లు జగన్ అనుసరిస్తున్న విధానం ద్వారా అర్థమవుతోంది. స్థానికంగా నేతల మధ్య ఉండే వివాదాలు, వర్గపోరు సమస్యల పరిష్కారాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రులు, మంత్రులకు అప్పగించిన సీఎం జగన్ స్థానిక సంస్థల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను మాత్రం ఆయనే ఎంపిక చేస్తున్నారు. వివిధ సర్వేల ద్వారా తెప్పించుకున్న సమాచారం ఆధారంగా ఇప్పటికే పార్టీ అభ్యర్థులను నిర్ణయించారు. ఆ వివరాలను ఆయా జిల్లాలకు పంపనున్నట్లు సీఎం జగన్ మంత్రులకు తెలిపారు. వారి విజయానికి పార్టీ కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని తేల్చి చెప్పారు.
ఎంపీపీ, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, నగరపాలక సంస్థ మేయర్ పదవులు ఎవరికి ఇచ్చేది కూడా ముందుగా చెప్పకూడదని సీఎం జగన్ నిర్ణయించారు. ముందుగానే వెల్లడిస్తే.. వర్గపోరు, అనవసర వివాదాలు, అసంతృప్తులకు అవకాశం ఇచ్చినట్లుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎవరికి ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు ఇవ్వాలన్నది సమిష్టి నిర్ణయం ద్వారా ఎంపిక చేద్దామని ఆయన మంత్రులకు చెప్పారని సమాచారం. ఇటీవల తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ విధానమే అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరించి ఉత్తమ ఫలితాలు కనబర్చింది. ఈ విధానమే ఏపీలోనూ అధికార వైఎస్సార్సీపీ అచరించనున్నట్లు అర్ధమవుతోంది. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా స్థానిక ఎన్నికల్లోనూ జగన్ విజయబావుటా ఎగురువేస్తారా..? లేదా..? వేచి చూడాలి.
5556