పట్టుపట్టరాదు.. పట్టువిడువరాదు అన్నట్లుగా.. అవినీతి నిర్మూలన చేయాలన్న తన లక్ష్యంలో సీఎం జగన్ ఏ మాత్రం పట్టువిడువడం లేదు. అవినీతి రహిత పాలన అందిస్తానని ఎన్నికల సభల్లో ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం జగన్ ఆ మేరకు ప్రారంభం నుంచి అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే అవినీతి నిర్మూలనకు పలు విధానపరమైన చర్యలు తీసుకున్న సీఎం జగన్ తాజాగా మరో ఆలోచన చేశారు. అవినీతి నిర్మూలనకు దిశ తరహాలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. లంచం తీసుకున్న వారికి సత్వరమే శిక్షపడేలా చేస్తేనే అవినీతి తగ్గుతుందన్న ఆలోచనతో నూతన చట్టం తీసుకురావాలనే ఆలోచన చేశారు. ఈ చట్టం ద్వారా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడిన అధికారులను నిర్థిష్ట కాలపరిమితితో కఠినమైన శిక్షలు, ఉద్యోగం నుంచి తొలగింపు చర్యలు చేపట్టాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు.
యంత్రాంగంలో అవినీతి నిర్మూలనకు ఏమి చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నిన్న సోమవారం ఐఐఎం అహ్మదాబాద్ ఓ సమగ్ర నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. సదరు నివేదికలో ఉన్న సూచనలను నూతనంగా రూపొదించే చట్టంలో పొందుపరిచే అవకాశం ఉంది. యంత్రాంగంలో పై స్థాయిలో అవినీతి తగ్గిందనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. కింది స్థాయిలోనే అవినీతి ఇంకా తగ్గలేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. సీఎంగా బాధ్యలు స్వీకరించిన సమయంలో జరిపిన ప్రతి సమీక్షలోనూ జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులకు అవినీతి నిర్మూలనపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పదే పదే తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. ఇది కొంత వరకు ఫలితాలను ఇచ్చింది. అవినీతి అంతంపై సీఎం జగన్ దృఢనిశ్చయంతో ఉన్నారన్న భావన అటు అధికారుల్లోకి, ఇటు ప్రజల్లోకి వెళ్లింది.
సీఎం జగన్ అవినీతి నిర్మూలనపై మాటలకే పరిమితం కాకుండా.. చేతల్లోనూ చూపించారు. ఇంతకు ముందు అవినీతి అధికారులపై ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రజలకు తెలిసేది కాదు. జగన్ సర్కార్ వచ్చాక ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడే అవినీతి నిర్మూలన జరుగుతుందనే యోచనలో 14400 నంబర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజలు నేరుగా ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేసేలా ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ దాడులు చేస్తోంది.
ఏసీబీని కూడా ప్రక్షాళన చేసిన సీఎం జగన్.. ముక్కుసూటిగా ఉండే సమర్థవంతమైన అధికారిని ఏసీబీ చీఫ్‌గా నియమించారు. ఏసీబీ చీఫ్‌గా సీతారామాంజనేయులు రాకతోనే.. సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ తదితర విభాగాలపై వరుస విరామంలో మూకుమ్మడి దాడులు చేశారు. గతంలో స్పష్టమైన ఆధారాలు ఉంటేనే ఏసీబీ దాడులు చేసే పరిస్థితి నుంచి.. ఇప్పుడు టోల్ ఫ్రి నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుని అవినీతి పరుల భరతం పడుతున్నారు. నూతన చట్టం దిశగా సీఎం జగన్ చేసే ఆలోచన రూపుదాల్చితే.. యంత్రాంగంలో అవినీతి మరింత తగ్గే అవకాశాలున్నాయి.