ఆంధ్రప్రదేశ్ పురోగతిలో కొత్త ఏడాది కాలం కీలకంగా మారబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలకు అనుగుణంగా కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమయ్యింది. దానికి ఫలితాలు కూడా కొత్త సంవత్సరం అందుకోబోతోంది.
ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో చట్టరూపం దాల్చిన వ్యవహారం పట్టాలెక్కబోతోంది. 2019 చివరిలో జగన్ ఈ ప్రతిపాదన చేశారు. 2020 జనవరిలో దానికి అసెంబ్లీ ఆమోదం లభించడంతో కొత్త అడుగులు పడ్డాయి. సంవత్సరాంతానికి చట్టంగా మారినప్పటికీ న్యాయపరమైన అంశాలతో కోర్టులో పెండింగ్ లో ఉంది. కానీ కొద్దిరోజుల్లోనే దానికి క్లారిటీ రాబోతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది మధ్య నాటికి కార్యనిర్వాహక, న్యాయ రాజధానులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే ఏపీలో పాలనా వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న కృషి ఫలిస్తుందనే చెప్పవచ్చు. రాష్ట్రాభివృద్ధిలో కీలక మార్పులకు దోహదం చేస్తుందనే భావించవచ్చు.
జిల్లాల విభజన ద్వారా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కార్యాచరణ మొదలయ్యింది. అధికారుల బృందం కసరత్తులు పూర్తి చేసింది. జనవరిలోనే నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దానికి సంబంధించిన చర్చ, చట్టం కూడా సిద్దం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు తెరమీదకు రావడానికి అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో ఆంధ్రప్రదేశ్ 25 లేదా 26 జిల్లాల నూతన రూపం ఈ కొత్త సంవత్సరంలోనే అందుకోబోతోందని చెప్పవచ్చు.
రాజకీయంగానూ జగన్ కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో సాగే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల కోసం పార్టీని ఆయన సన్నద్ధం చేశారు. విద్యావంతుడైన డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించి ప్రత్యర్థుల కన్నా పైచేయిలో సాగుతున్నారు. మానసికంగానూ తన పట్టు నిలుపుకున్నారు. తిరుపతి ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా అధికారిక పార్టీ విజయం నల్లేరుపై నడక లాంటిదేననే అబిప్రాయం బలపడుతోంది. ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో వైఎస్సార్సీపీ ఉండడంతో తిరుపతిలో మరోసారి తిరుగులేని విజయం సాధించి కొత్త సంవత్సరంలో పట్టు మరింత పెంచుకునే పనిలో జగన్ ఉన్నట్టు కనిపిస్తోంది.
పాలనా పరంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనూ అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనివ్వబోతున్నారు. పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి అనుగుణంగా తన టీమ్ లో మార్పులు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని మొదట్లోనే జగన్ ప్రకటించారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఆ గడువు ముగుస్తుంది. అప్పటి వరకూ వేచి చూస్తారా లేక మరికొన్ని నెలల్లోనే ముహూర్తం పెడతారా అనే చర్చ కూడా మొదలయ్యింది. ఏమయినా జగన్ మంత్రివర్గంలో మార్పులకు కూడా ఈసంవత్సరం వేదిక కాబోతోంది.
పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కూడా తుది రూపం సిద్ధమవుతోంది. 2022 లో పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని శపథం చేసిన జగన్ ప్రభుత్వంలో ఇప్పటికే స్పిల్ వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలయ్యింది. మే తర్వాత కాఫర్ డ్యామ్ పూర్తిగా నిర్మించిన తర్వాత నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి మెయిన్ డ్యామ్ పనులు వేగం పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే 2021 చివరి నాటికి పోలవరం తుది రూపు దశకు వస్తుంది. ఇప్పటికే జగన్ చేసిన ప్రయత్నాలతో ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలు సవరించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్న తరుణంలో పునరావాసం వేగం పుంజుకుంటే పోలవరం పూర్తి చేసే దశకు చేరడం పెద్ద కష్టం కాదు.
ఏమయినా కొత్త ఏడాదిలో జగన్ ప్రభుత్వం తీసుకురాబోతున్న మార్పులు ఆంధ్రప్రదేశ్ దశ దిశను సమూలంగా మార్చబోతున్నాయని చెప్పవచ్చు. నవ్యాంధ్రప్రదేశ్ కి నిజమైన రూపురేఖలు ఈ ఏడాదిలో సంతరించుకుంటాయని అంచనాలు వేయవచ్చు.