అర్హత ఉండి.. ప్రభుత్వ పథకం అందలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. చిన్న చిన్న కారణాల వల్ల అర్హులు సంక్షేమ పథకాలకు దూరంగా కాకూడదు.. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ఆధారంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి… ఇదీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతున్న మాట. ఈ మాట చెప్పడమే కాదు.. ఆచరణలో కూడా చేసి చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి.
పథకం అమలు చేసిన తర్వాత కూడా అర్హులు ఎవరైనా మిగిలితే.. దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజులు సమయం ప్రతి పథకంలోనూ ఇస్తున్నారు. అంతేకాదు.. వివిధ వర్గాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు ఆయా పథకాలకు కొత్తగా అర్హులను చేరుస్తున్నారు. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లకు 75 వేల రూపాయలు ఇచ్చేలా రూపొందించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని గత నెల 12వ తేదీన సీఎం జగన్ ప్రారంభించారు. వితంతు, ఒంటరి మహిళలు పింఛన్ తీసుకుంటున్నారని.. మొదట వారు అనర్హులుగా పరిగణించారు. అయితే ఏ ఆధారం లేని వారికి కూడా పథకం వర్తింప జేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో.. కొత్తగా 8 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు.
తాజాగా ఈ పథకంలో మరికొన్ని కులాల మహిళలను కూడా అర్హులుగా చేరుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సంచార జాతుల వారికి, గిరిజనుల్లో బాగా వెనుకబడిన కులాల మహిళలకు ఈ పథకం వర్తింపజేయాలని ఆదేశించారు. బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కోంద్, బెంతొ ఒరియా కులాలోని 45–60 ఏళ్ల మహిళలకు కుల ధృవీకరణ పత్రం లేకుండా ఈ పథకం అందించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సెర్ఫ్ అధికారులు ఆయా కులాల్లో అర్హులైన వారిని గుర్తించే పనిలో పడ్డారు. స్థిర నివాసం లేకుండా సంచార జీవతం గడిపే ఈ కులాలకు మేలు చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.