రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకునికి శిరోముండనం చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎస్సై,ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే దళిత యువకుడికి సీతానగరం పోలీసులు శిరోముండనం చేయడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు స్థానిక వైసీపీ నాయకుడు వరప్రసాద్ అనే వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేశాడని అత్యుత్సాహం చూపించిన పోలీసులు వరప్రసాద్ ను తీవ్రంగా కొట్టి గాయపరచడంతో పాటు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ ను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ఘటనపై విచారణ జరిపించారు. డీజీపీ ఆదేశాలతో వెదుళ్లపల్లిలోని బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. ఎస్సై మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ ఘటనకు కారణమయ్యారని తెలియడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. దళిత యువకుడిని గాయపరిచిన పోలీసులపై చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని డీజీపీ వెల్లడించారు.