థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి ఏ సినిమాలు ముందు వస్తాయన్నది కాసేపు పక్కనపెడితే ఈ వ్యవస్థకు ప్రత్యాన్మయంగా ఓటిటి ఎదుగుతున్న మాట వాస్తవం. ఈ ప్రభావం వల్లే కాస్త క్రియేటివిటీ ఉండి కొంచెం అదృష్టం కలిసి వస్తే చాలు ఎవరెవరో దర్శకులు అయిపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ కంటెంట్ కావాలని కోరుకుంటున్న డిజిటల్ సంస్థలు కొన్నిసార్లు స్క్రిప్ట్ ని పూర్తిగా చెక్ చేసుకోకుండానే కేవలం క్యాస్టింగ్, కాంబినేషన్లు నమ్ముకుని దెబ్బ తింటున్నాయి. కారణం స్పష్టం. ఇండిపెండెంట్ మూవీ లేదా షార్ట్ ఫిలింకి ఫుల్ లెన్త్ సినిమాకు ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పటి నవతరం డైరెక్టర్లు గుర్తించకపోవడమే.
యుట్యూబ్ లోనో లేదా ఏదైనా ప్లాట్ ఫార్మ్ మీదనో ఓ లఘు చిత్రం తీసి ఒకరు మంచి పేరు తెచ్చుకున్నారనుకుందాం. అంత మాత్రాన అవే ఆలోచనలు, ఐడియాలు సిల్వర్ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఒకటికి రెండు సార్లు ఈ వ్యత్యాన్ని స్పష్టంగా గుర్తించగలిగే మెచ్యూరిటీ వచ్చినప్పుడే విజయం అందుకోగలరు. అలా కాకుండా షార్ట్ ఫిలిం ఇచ్చిన కాన్ఫిడెన్స్ ని మాత్రమే నమ్ముకుంటే ఫలితం ఇంకోలా వస్తుంది. దానికి ఉదాహరణగా శ్రీకారం, థాంక్ యు బ్రదర్, బట్టల రామస్వామి బయోపిక్, అర్ధ శతాబ్దం లాంటివి చెప్పుకోవచ్చు. ఇవన్నీ చాలా చిన్న లైన్ ని నమ్ముకుని రెండు గంటల పాటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినవి.
ఇకపై మేకర్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే మెటీరియల్ తమ కథలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఓటిటికి మాత్రమే తీస్తున్నాం అనుకున్నా సరే భవిష్యత్తులో వీటికి వచ్చే ఆదరణని డిజిటల్ సంస్థలు సీరియస్ గా విశ్లేషించుకుంటాయి. ఈ కారణంగానే ఒకప్పుడు రీజనల్ వెబ్ సిరీస్ లను ప్రోత్సహించిన ప్రైమ్ మనవాళ్ళు క్వాలిటీగా తీయడం లేదని గుర్తించి కేవలం హిందీకే పరిమితమయ్యింది. ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగితే ఆహా లాంటి ప్యూర్ తెలుగు యాప్స్ కూడా ఆలోచనా ధోరణిని మార్చుకుంటాయి. సో యాప్ అయినా థియేటర్ అయినా ఎంగేజ్ చేసే కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా వృధానే