ఎన్నాళ్ళో వేచిన ఉదయం నిన్న టాలీవుడ్ కు ఎదురయ్యింది. డిసెంబర్ 4న హైదరాబాద్ థియేటర్లలో అధిక శాతం జనంతో కళకళలాడాయి. క్రిస్టోఫర్ నోలన్ కొత్త మూవీ టెనెట్ కి జనం బారులు తీరారు. అడ్వాన్స్ బుకింగులు జోరుగా ఉన్నాయి. వీకెండ్ కాబట్టి పివిఆర్, ఏఎంబి, ఐనాక్స్, సినీ పోలీస్ లాంటి ప్రధాన మల్టీ ప్లెక్సులన్నీ పబ్లిక్ తో సందడిగా కనిపించాయి. సింగల్ స్క్రీన్లు ఈ స్థాయిలో కాకపోయినా దేవి లాంటి పెద్ద థియేటర్ కూడా రష్ గానే కనిపించింది. టెనెట్ తెలుగు, హిందీ వెర్షన్ లో కూడా విడుదల చేయడం చాలా ప్లస్ అయ్యింది. బుర్రపెట్టి ఆలోచిస్తేనే అర్థం కావనే నోలన్ సినిమాను ఇలా అనువదించడం ద్వారా నిర్మాతలు మంచి పని చేశారు. దాని ఫలితం కనిపిస్తోంది.
ఈ రోజు రేపు కూడా పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. కానీ ఎక్కువ రోజులు క్రౌడ్ ని రప్పించగలిగే యునివర్సల్ కంటెంట్ టెనెట్ లో లేదు. మహా అయితే ఓ వారం రోజులు అంతే. ఆ తర్వాత మళ్ళీ మొదటికే వస్తుంది. ప్రతి శుక్రవారం ఒకటో రెండో సినిమాలు విడుదలైతేనే బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంటుంది. అలాంటిది సోలో బ్రతుకే సో బెటరూ వచ్చే దాకా 20 రోజులు ఇలాగే కంటిన్యూ చేయడం అంటే మాటలు కాదు. ఆల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మళ్ళీ అదే పనిగా థియేటర్లో చూసే మూడ్ లో జనం లేరు. ఇది కొంత లోతుగా ఆలోచించాల్సిన అంశం.
సామాన్యుడు గడప దాటి హాల్ కు రావాలంటే తెలుగు సినిమా కావాలి. నిన్న సాయి ధరమ్ తేజ్, మారుతీ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా థియేటర్ కు వెళ్లి మరీ ఫోటోలు వీడియోలు విడుదల చేయడం మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఇది సరిపోదు. అందుకే నిర్మాతలు వేగంగా ప్రణాళికలు వేసుకుని సగం సీట్లతో అయినా సరే ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయడం ద్వారా రెవిన్యూ ఎలా రాబట్టుకోవచ్చో ప్లానింగ్ వేసుకోవాలి. కోరుకున్నది ఇస్తే థియేటర్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు నిన్న కలెక్షన్స్ రూపంలో చెప్పారు. జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల రోజు ఇంత మంచి వసూళ్లు రావడం కంటే పరిశ్రమకు శుభసూచకం ఏముంటుంది.