సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొట్టమొదటిసారిగా సొంతగడ్డ చిత్తూరు జిల్లాకు బుధవారం రానున్నారు. చిత్తూరు జిల్లా మామండూరులో మూడురోజుల పాటు పార్టీ శ్రేణులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. ఓటమి తర్వాత చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోక పోవడంతో పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం అలముకొంది. ఈ నేపథ్యంలో ఆయన రాకతోనైనా టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం వస్తుందని వారు ఆశిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు, పార్లమెంటు స్థానాల్లో టీడీపీ ఓటమి ఘోర పరాజయం పాలైంది. చంద్రబాబు మెజార్టీ కూడా గతంతో పోల్చితే తగ్గడం టీడీపీ శ్నేణుల్లో ఒకింత ఆందోళన కలిగించే అంశం. కుప్పం మెజార్టీ చిత్తూరు పార్లమెంట్ నుంచి టీడీపీ గెలిచేందుకు ప్రతి ఎన్నికల్లోనూ కలసి వచ్చేది. ఈ దఫా సీన్ రివర్స్ అయ్యింది.
ఎలాగైనా సొంత జిల్లాపై పట్టు సాధించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. అయితే అందుకు పార్టీ నాయకుల నుంచి సరైన సహకారం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నంత వరకూ అందరూ నాయకులే. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తమను కాకుండా చూసుకోమన్నట్టు సిగ్నల్స్ పంపిస్తున్నారు.
శ్రీకాళహస్తి నుంచి బలమైన నాయకత్వం ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం కొంత కాలంగా చాలా స్తబ్ధుగా ఉంది. గోపాలకృష్ణారెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా ఆయన తనయుడు సుధీర్, భార్య పార్టీలో కీలకంగా ఉండేవారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారో కూడా తెలియని స్థితి. అలాగే రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డీకే సత్యప్రభ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రగిరిలో నాని పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఒక్క అమర్నాథరెడ్డి మాత్రం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చంద్రబాబు వస్తున్నారు. మొదటి రోజైన బుధవారం పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం, మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రెండోరోజు జిల్లాలోని వైసీపీ బాధితులతో, ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. చివరిగా మూడో రోజు పార్టీ సమన్వయ కమిటీతో . చంద్రగిరి, కుప్పంతో సహా మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతారని టీడీపీ జిల్లా నేతలు తెలిపారు. చూద్దాం బాబు మంత్రాంగం ఏ మాత్రం ఫలిస్తుందో?