దేనికైతే భయపడి ఆచార్య షూటింగ్ ని త్వరగా ప్రారంభించడానికి చిరంజీవి వెనుకడుగు వేశారో చివరికి ఆ మహమ్మారి ఆయనను కూడా వదల్లేదు. ఈ రోజు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టాల్సి ఉండగా ప్రోటోకాల్ లో భాగంగా జరిపిన టెస్టుల్లో చిరుకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ క్వారెంటైన్ కు వెళ్లిపోయారు. వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టి చికిత్స అందుకుంటున్నారు. నిజానికి చిరంజీవిలో అలాంటి లక్షణాలు ఇంతకు ముందు కనిపించకపోవడంతో ఆచార్య కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా పరీక్ష జరిపాక ఇప్పుడీ నిజం బయటపడింది. ఇది షాక్ కలిగించేదే అయినా భయపడాల్సింది ఏమి లేదు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రాజమౌళి, రాజశేఖర్ లాంటి ఎందరో ఇండస్ట్రీ ప్రముఖులకు కరోనా రావడం, తగ్గిపోయి వాళ్ళు నార్మల్ కావడం జరిగిపోయింది. అందులోనూ చిరుకు సింప్టమ్స్ పెద్దగా లేవు కాబట్టి ఖంగారు పడాల్సింది ఏమి లేదు. తనను గత అయిదు రోజుల్లో కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చిరంజీవి స్వయంగా విడుదల చేసిన నోట్ లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తర్వాత ఇది జరగడం గమనార్హం. దీని ప్రకారం నాగ్ సైతం టెస్టు చేయించుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా చిరుని కలిసిన వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు.
ఆచార్యకు అంతా సెట్ అయిపోయిందన్న తరుణంలో ఇలా బ్రేక్ పడటం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే అంశమే. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల చాలా ఆలస్యమయింది. ఒకపక్క బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు షూటింగులో బిజీగా ఉండగా మెగాస్టార్ ది మాత్రమే లేట్ అయ్యింది. ఇప్పుడిలా ట్విస్ట్ వచ్చి పడింది. సో ఒక రెండు మూడు వారాలు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి కానీ నిర్ణయం తీసుకోలేరు. జనవరి 2021 దాకా వేచి చూడక తప్పేలా లేదు. చిరంజీవి వయసు దృష్ట్యా ఎక్కువ బయటికి వెళ్లడం, ఎక్కువ జనంతో కలవడం లాంటివి సురక్షితం కాదు. వ్యాక్సిన్ వచ్చేదాకా ఇలాంటి ఇబ్బందులు అందరినీ వెంటాడేలా ఉన్నాయి