ప్రజారాజ్యం అధినేతగా పొలిటికల్ ఎంట్రీ, కాంగ్రెస్ తరుపున కేంద్ర మంత్రిగా ఎదిగిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం గడువు ముగియడంతోనే చిరంజీవి తన రాజీకయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇదంతా జరిగి ఆరేళ్లవుతోంది. అంతకుముందు ఆరేడేళ్ల పాటు రాజకీయంగా ఎదుగుదలకు ప్రయత్నించిన చిరంజీవి ఆ తర్వాత పూర్తిగా విరమించుకున్నారు. అయినా గానీ నిత్యం కీలక అంశాలలో స్పందించడం మాత్రం మానుకోలేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను చిరంజీవి పదే పదే అభినందిస్తున్నారు. మూడు రాజధానులు మొదలుకుని అనేక అంశాల్లో తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పడమే కాకుండా జగన్ చొరవను కొనియాడారు. ఇదంతా ఓ వర్గానికి మింగుడుపడడం లేదు. చిరంజీవి స్పందించడం జీర్ణించుకోలేని సెక్షన్ నిత్యం ఏదో రూపంలో ఆయన మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తోంది.
గతంలో చిరంజీవి చెప్పినట్టుగా ఆయన రాజకీయ ఆరంగేట్రం కోసం తన సన్నిహితుల కన్నా ఓ వర్గం మీడియా పెద్దలే ఎక్కువ ఆతృత ప్రదర్శించారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. 2004 ఎన్నికల్లో ప్రజాదరణతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివిధ పథకాలతో సామాన్యులను ఆకట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో జనాలకు చేరువయ్యారు. దాంతో వైఎస్సార్ ని గద్దె దింపాలంటే చంద్రబాబు తో సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా ప్రజారాజ్యం పేరుతో చిరంజీవిని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తొలుత విపరీతంగా ప్రోత్సహిస్తున్నట్టు కథనాలు ఇచ్చారు. కానీ చివరకు చిరు పొలిటికల్ ఎంట్రీ అనివార్యంగా చంద్రబాబు కి సైతం ఏదో మేరకు చేటు చేస్తుందని గ్రహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి కాపు నేతలు వైఎస్సార్ ని వీడకపోగా, టీడీపీలో కాపు నేతలు ప్రజారాజ్యానికి క్యూ కట్టడం బాబు బ్యాచ్ కి గిట్టలేదు.
వాస్తవానికి సుదీర్ఘకాలంగా టీడీపీకి దూరంగా ఉన్న కాపుల ఓట్లు తమకెలానూ దక్కవు కాబట్టి కాంగ్రెస్ నుంచి చీలిస్తే అది టీడీపీకి మేలు చేస్తుందని ఆశించారు. కానీ తీరా చూస్తే కాంగ్రెస్ తో పాటుగా టీడీపీకి కూడా ఏదో మేరకు నష్టం చేకూరుస్తున్న తరుణంలో చిరంజీవిని సహించేది లేదంటూ జెండా పీకేద్దాం అనేంత వరకూ కథనాలు వండి వార్చారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల కథనాలు అప్పట్లో తనను ఎంతో బాధించాయని చిరంజీవి పలుమార్లు వాపోవడం గమనిస్తే ఏ రీతిలో వేధించారో అర్థమవుతుంది. అంతిమంగా వైఎస్సార్ విజయాన్ని అడ్డుకోలేకపోవడం, ఆయన మళ్లీ అధికారంలోకి రావడం వంటివి జరిగాయి. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే.
అయితే ఇటీవల చిరంజీవి సమస్యల మీద స్పందిస్తుడడం కూడా చంద్రబాబు సన్నిహితులకు గిట్టడం లేదు. పవన్ ని అడ్డంపెట్టుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టాలనే కుయత్నంలో ఉన్న తమకు చిరంజీవి అడ్డుపడతారనే ఆందోళన ఆ వర్గంలో ఉంది. అందుకే చిరంజీవి మీద నిత్యం రాళ్లేసే ప్రయత్నం చేస్తోంది. అయినా ఆరంభంలోనే ఇలాంటి ఎదురుదెబ్బలు ఎన్నో తిన్న చిరంజీవి వాటిని పెద్దగా ఖాతరుచేస్తున్న దాఖాలాలు లేవు. తాజాగా సినీ రంగం, ఏపీ ప్రభుత్వం మధ్య ఏర్పడిన వైరుధ్యం సమసిపోయేందుకు చిరు ఓ ప్రయత్నం చేశారు. నేరుగా జగన్ తో భేటీ అయ్యారు. సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కూలంకశంగా స్పందించిన వైనాన్ని వెల్లడించారు. ఎవరూ నోరు జారవద్దని హెచ్చరించారు.
రెండు మూడు వారాల్లోనే విస్తృత చర్చల తర్వాత మరో జీవో వెల్లడయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదంతా గమనిస్తే టాలీవుడ్ పెద్దల్లో కొందరికి గిట్టని రీతిలో చిరంజీవి పెద్దరికం ఫలితాన్నిచ్చేలా కనిపిస్తోంది.
వెంటనే సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం మొదలయ్యింది. సమస్య సమసిపోవడం సహించలేని సెక్షన్ చిరంజీవికి ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం ప్రారంభించింది. ఆయన ఇండస్ట్రీ సమస్యల మీద తాడేపల్లి వెళ్లలేదని, తనకు రాజ్యసభ సీటు కోసం చర్చించడానికే జగన్ ని కలిశారంటూ కథనాలు మొదలయ్యాయి. దాంతో ఈ రచ్చకి తెరదించాలని నిర్ణయించుకున్న చిరంజీవి తన అభిప్రాయాన్ని మరసారి స్పష్టం చేసేశారు.
తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, తనకు పదవులు అవసరం లేదని, తీసుకునే అవకాశం కూడా లేదని తేల్చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోయినా ప్రస్తుతానికి చిరంజీవి చాలా క్లారిటీతో ఉన్నట్టు తేలిపోయింది. అయినప్పటికీ అసలు విషయానికి మసిపూసేయాలనే కుట్రలు చేస్తున్న వర్గానికి చిరంజీవి ఇచ్చిన స్పష్టత మింగుడుపడే అవకాశం లేదు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికే ఆయన పరిమితమవుతున్నారనే వాస్తవం రుచించే ఛాన్స్ లేదు. అందుకే చిరంజీవి మీద బురదజల్లే పనికి పూనుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన చిత్తశుద్ధిని శంకించేలా ఓ ప్రహసనం ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తంగా నాడు-నేడు కూడా చిరంజీవిని ఆ వర్గం వెంటాడుతున్న తీరు విస్మయకరమే.