ఆయనకు తొలినాళ్లలో ఏ పదవీ లేదు. ఆయినా దానికి అండగా నిలవడం తన కర్తవ్యంగా భావించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కార్యకర్తలు, నాయకులను కూడదీశారు.. వారిలో మానసిక స్థైర్యం నింపారు. అందరినీ ఒక్కతాటిపై నిలిపి అనేక ఉద్యమాలతో అధికార పక్షానికి సవాల్ విసిరారు.
జిల్లాలో అణువణువు తెలిసిన అనుభవం.. వ్యూహ చతురత పార్టీకి కలిసి వచ్చాయి. దానికి తోడు జగన్ చరిష్మాతో రెండేళ్లనాటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మజ్జి శ్రీనివాస్ తన పనితీరుతో అధినేత జగన్ ను మెప్పించారు. తొలుత పార్టీ జిల్లా సమన్వయకర్తగా.. ఇప్పుడు జిల్లా పరిషత్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక అయ్యారు. తన ప్రతిభతో పార్టీలో గుర్తింపు పొంది విజయనగరం జిల్లా పాలన పగ్గాలు చేపట్టబోతున్నారు.
మేనమామ బొత్స వెంట రాజకీయ అడుగులు
చిన్న శ్రీనుగా జిల్లా ప్రజలకు సుపరిచితుడైన మజ్జి శ్రీనివాసరావు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు. బీ టెక్ చేసిన వెంటనే మామ చెయ్యి పట్టుకుని రాజకీయాల వైపు అడుగులు వేయడం ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే రాజకీయ వ్యూహ నిపుణుడిగా మారిపోయారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల క్రితమే మామ బొత్స తరఫున జిల్లాలో రాజకీయ వ్యవహారాలన్నీ చక్కబెట్టడం ప్రారంభించారు. అయితే ఏనాడూ తెరపై కనిపించలేదు.
Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం
చిన్న శ్రీను పేరు తప్ప మనిషి ఎలా ఉంటారో కొన్నేళ్ల పాటు ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అంత నిగూఢంగా తెరవెనుక వ్యూహ రచనలు చేసి కాంగ్రెసుకు తిరుగులేకుండా చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్సపై యుద్ధం పేరుతో విజయనగరం వచ్చి రచ్చ చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పన్నిన వ్యూహాన్ని చిత్తు చేయడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్ శ్రేణులను సమీకరించి..చంద్రబాబు చుట్టూ మోహరించి ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా.. ఆయన్ను అవమానంతో వెనక్కి వెళ్లేలా చేసి.. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
బొత్సను వైఎస్సార్సీపీ వైపు నడిపించారు
వైఎస్ తదనంతరం రాష్ట్ర విభజన వంటి పరిణామాల్లో కాంగ్రెస్ పూర్తిగా చితికిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఓడిపోవడం జిల్లాలో ఆయన ప్రభ మసకబారింది. అంతవరకు ఆయన వెంట ఉన్న అనేకమంది నేతలు జారుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో చిన్న శ్రీను బొత్స వెంటే ఉండి వైఎస్సార్సీపీలో చేరేలా చేశారు. అటు పార్టీ నాయకత్వంతోనూ మాట్లాడి బొత్స చేరికకు లైన్ క్లియర్ చేశారు.
పార్టీలో చేరినప్పటి నుంచి జిల్లాలో పార్టీని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశారు. 2014 ఓటమి భారంతో కుంగిపోయిన, చేదిరిపోయిన కార్యకర్తలను మళ్లీ చేరదీసి పార్టీని పటిష్ట పరిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సందర్బంగా ఆయన జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి జిల్లా దాటేవరకు చిన్న శ్రీను ఆయన వెన్నంటే ఉండి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ పిలుపు మేరకు జిల్లాలో ఎన్నో ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించి జగన్ వద్ద మంచి గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అతన్ని జిల్లా సమన్వయకర్తగా నియమించింది.
Also Read : పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?
అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్
మజ్జి శ్రీను పర్యవేక్షణ, వ్యూహ రచన.. జగన్ గాలి కలిసి 2019 ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ తీశాయి. జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం ఎంపీ సీటును గెలుచుకుని వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఏడాది జరిగిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ జైత్ర యాత్ర కొనసాగించడంలో మజ్జి శ్రీను కీలక పాత్ర పోషించారు. దాంతో తొలిసారి అధికార హోదా అందుకునే అవకాశాన్ని పార్టీ కల్పించింది.
మెరకముడిదాం జెడ్పీటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనును జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. ఈ పదవికి ఆయన తప్ప ఇతర పేర్లేవీ పరిశీలనలోకి రాకపోవడం జిల్లాపై ఆయనకున్న పట్టుకు నిదర్శనం. జిల్లాలోని మొత్తం 34 జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. దాంతో ఇంతవరకు పార్టీపరంగానే సేవలు అందించిన చిన్న శ్రీను ఇకనుంచి ప్రభుత్వపరంగాను కీలకం కానున్నారు.
Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?