మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మలి విడత అమరావతి ఉద్యమానికి చిన్నపాటి బ్రేక్ పడింది. అమరావతి ఉద్యమంలో భాగంగా ఈ రోజు బుధవారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణ పర్యటనకు చంద్రబాబు వెళ్లాల్సి ఉంది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆ పార్టీ తెనాలి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు.
ఇటీవల తెనాలిలో అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలు కూడా కార్యక్రమం నిర్వహించారు. ఇరు పక్షాలు ఎదురెదురుగా టెంట్లు వేసి పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇది ఘర్షణకు దారితీసింది. కోడిగుడ్లు, రాళ్లు విసురుకున్నారు. టెంట్లకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేశారు. అయితే మండలి రద్దు వ్యహారం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై దృష్టి పెట్టెందుకుగాను ఈ పర్యటనను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసుకున్నారు. l
కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం, అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులు మండలికి పంపగా సెలెక్ట్ కమిటికీ మండలి చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ పంపారు. అయితే ఎన్ని ఆటంకాలు కలిగినా మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు టీడీపీ అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తుండడం గమనార్హం.
4343