కరోనా విజృంభిస్తున్న వేళ కేరళ ప్రభుత్వానికి అక్కడి ప్రతిపక్షంగా అండగా నిలిచింది. విలేకరుల సమావేశాలు కూడా అధికార, ప్రతిపక్ష నేతలు కలిపి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇతర విషయాల్లో ఎలాగున్నా కష్టకాలంలో ఇరు పక్షాలూ కలిసి పని చేయడం మూలంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
ప్రజాస్వామ్యబద్ధమైన ప్రతిపక్షం అలా ఉండాలి.
కరోనా విజృంభణ వేళ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు.. చిత్తశుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వంపై జూమ్ ద్వారా ఆరోపణలు చేసేవారు. కరోనా కట్టడికి ఏపీ తీసుకుంటున్న చర్యలను దేశమంతా పొగుడుతుంటే.. ఆయన మాత్రం విమర్శిస్తూ ఆయనే విమర్శలపాలైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏలూరు ఘటనలోనూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి.. చిత్తశుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరోగ్య, ఆర్థికపరమైన చర్యలు..
ఏ ప్రభుత్వమైన ప్రజల కోసం పథకం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం ఉన్నంత వరకూ ఒకే నిబంధనలు అమలవుతూ ఉంటాయి. కానీ జగన్ ఈ విషయంలో ప్రజాకోణంలో ఆలోచిస్తున్నారు. అవసరాన్ని బట్టి సహాయ మొత్తాన్ని పెంచడం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పథకాల పరిధిని పెంచడం చేస్తున్నారు. ఏలూరు ఘటనలోని బాధితుల కోసం కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో బాధితులను స్వయంగా పరామర్శించిన జగన్ వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు సాధారణ మూర్ఛ వ్యాధిగ్రస్తుడు మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం సహాయం అందించేది. ప్రస్తుతం ఐదు రోజులపాటు వైద్యం పొందినప్పటికీ ఆ సాయం వర్తింపజేస్తారు.మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,000 నుంచి రూ.15,688 వరకు పెంచారు. 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపారు. చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ రూ.10,262 నుంచి రూ.12,732కు పెంచారు. 6 రకాల రక్త పరీక్షలను అందులో చేర్చారు. ఐదు రోజులకు మించి అదనంగా చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు రూ.900, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి రూ.2,000 ప్యాకేజీని కొత్తగా చేర్చారు. నూతన విధానం మేరకు రక్త పరీక్షలకు 23.73 శాతం రేటు పెంచడం వల్ల అన్ని నెట్వర్క్ (ప్రభుత్వ, ప్రైవేట్) ఆస్పత్రులకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రతీదీ రాజకీయం తగదు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లాలో నీరు కలుషితం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. నిత్యం రాజకీయాలు చేయడం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కి మంచిది కాదని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించకుండా.. బురద చల్లుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. ‘‘ఏలూరు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి స్వయంగా బాధితులును పరామర్శించారు. మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుండి ఎయిమ్స్, పూణే నుండి వైద్య బృందాలు వచ్చి బాధితుల నుండి శాంపిల్స్ సేకరించారు. త్వరలో రిపోర్ట్స్ కూడా వస్తాయని’’శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు
చంద్రబాబు బాధ్యతారాహిత్యం సిగ్గుచేటు..
ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని.. వారికి అండగా నిలబడి భరోసా కల్పించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉంటే రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. ఏలూరు ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనతో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి దుష్టరాజకీయాలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారని, ఇక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించి సత్వర వైద్య సేవలకు ఆదేశించారని గుర్తు చేశారు. దానిపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించటం దుర్మార్గమన్నారు. 40 ఏళ్ల అనుభవంతో మంచిగా సూచనలు, సలహాలు చేయటం మానేసి ఇలా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు.