నాయకుడు అనే వాడు కార్యకర్తలకు అండగా ఉండాలి. ఎన్నికలు వస్తున్నాయంటే అభ్యర్థులకు కొండంత ధైర్యం ఇవ్వాలి. మద్దతుగా ప్రచార పర్వంలోకి దిగి ప్రత్యుర్థులను తిప్పి కొట్టాలి. తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి. గ్రేటర్ బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆ అవకాశం దక్కలేదు. అధినేత అండలేకుండానే ఎన్నికల్లో నిలదొక్కుకోవడానికి తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన లేకపోయినా పార్టీ నుంచి ముఖ్య నేతలను కూడా ప్రచారంలోకి పంపలేదు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి మహామహులందరూ రంగంలోకి దిగి ప్రచారపర్వాన్ని రక్తి కట్టిస్తే టీడీపీ నుంచి చంద్రబాబునాయుడు కాదు కదా.. కనీసం లోకేష్ కూడా ప్రచారానికి రాలేదు. పోనీ ఆ పార్టీ నుంచి ముఖ్యనేతలనైనా పంపకపోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహోగ్రపోరులో మన నేత ఎక్కడ..?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను తెలుగుదేశం నుంచి 106 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. టీఆర్ఎస్ ఒక్కటే 150 డివిజన్లలోనూ పోటీ చేస్తుండగా.. బీజేపీ 149 స్థానాలలోను, కాంగ్రెస్ 147 స్థానాల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి అగ్ర నేతలందరూ రంగంలోకి దిగారు. వారం రోజులుగా ఆయా డివిజన్లలో తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలైతే తూటాల్లాంటి మాటలతో, పరస్పర దూషణలు, ఆరోపణలతో ఆయా పార్టీలను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్ నుంచి కూడా ఉత్తమ్ సహా పేరున్న నేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. ఎటొచ్చి తెలుగుదేశం అభ్యర్థులకు మాత్రమే అధినేత అండ లేకుండా పోయింది. ఆ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, ఉపాధ్యక్షురాలు సుహాసిన మినహా ఇతరులెవ్వరూ ప్రచారానికి రాలేదు. మిగతా పార్టీలకు ఆయా నేతల సహకారాన్నిగమస్తున్న టీడీపీ అభ్యర్థులు తమ తరఫున మాట్లాడానికి చంద్రబాబు రాకపోయినా కనీసం లోకేష్ కైనా బాధ్యతలు అప్పగించకపోవడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మహోగ్రపోరులో మన నేతలు మనకు అండగా లేకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు.
మెస్సేజ్ కే పరిమితం
జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆ పార్టీ అభ్యర్థులకు సహకారం అందించని చంద్రబాబునాయుడు ప్రచారం ముగింపు రో్జున మాత్రం ట్విట్టర్ ద్వారా ఓ మెస్సేజ్ పంపారు. హైదరాబాద్ అభివృద్ధిలో పూర్వ వైభవం పొందాలంటే తెలుగుదేశానికి ఓటేయ్యాలని కోరారు. పనిలో పనిగా తన మార్క్ బ్రాండ్ మాటల ద్వారా ఓటర్లకు మెస్సేజ్ ఇచ్చారు. నగరానికి బిల్ గేట్స్, బిల్ క్లింటన్లను రప్పించి ఐటీ కంపెనీలను స్థాపించిన ఘనత తమదేనని, నగరం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే టీడీపీ కి ఓటేయాలని కోరారు. తమ వల్లే సైబరాబాద్ నిర్మాణం జరిగిందన్నారు. ఇలా హైదరాబాద్ లో అభివృద్ధికి కారణమైన అన్ని అంశాలూ తమ వల్లేనని చెబుతూ టీడీపీకి ఓటు వేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు. తమ అధినేత నుంచి తమకు అందిన మద్దతు అదేనంటూ సరిపెట్టుకోవడం ఆ పార్టీ అభ్యర్థుల వంతైంది.