గత రెండురోజులుగా జరిగిన విజయవాడ , గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తీరు చూస్తే తన పై తాను నియంత్రణ కోల్పోతున్నారు అనిపించక మానదు . మొన్న స్థానిక నాయకులతో కలిసి వెస్ట్ , సెంట్రల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్న బాబు ఓటర్లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
మిమ్మల్ని ఏమనాలో అర్ధం కావడంలేదు , మీ కోసం ఎన్ని చేసాను , పట్టిసీమ నాకోసం కట్టుకొన్నానా , అమరావతి నా కోసం నిర్మించానా , ఈ ప్రాంతం కోసం చేశా , నా మీద అభిమానం అక్కర్లా అంటూ వైసీపీకి ఓట్లేసి ఊడిగం చేసుకోండంటూ 2019 ఎన్నికల్లో వెస్ట్ , సెంట్రల్ నియోజక వర్గాల్లో ఓటమి తాలూకూ అక్కసుని స్థానిక ఓటర్ల పై వెళ్లగక్కారు . ఈ రోజు నేను మిమ్మల్ని ఓట్లు అడగాలా , వాళ్ళకే ఓట్లేసి బెంగుళూరు , చెన్నై లలో పాచిపని చేసుకోండంటూ చేసిన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో , కార్యకర్తల్లో అయోమయ స్థితి నెలకొంది .
Also Read:అశోక్ ను ఆవహించిన బాలయ్య !! మహిళా కార్యకర్తను కొట్టిన ఇజీనారం మారాజు..!
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన భారీ పరాజయం , స్థానిక పంచాయితీ ఎన్నికల్లోనూ వెంటాడటం , ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఈస్ట్ లో కొంత సానుకూల పరిస్థితి తప్ప వెస్ట్ , సెంట్రల్ లో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం , స్థానిక విభేదాలతో పట్టు చిక్కే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ కూడా చేజారుతుందన్న ఆందోళనలో అదుపు తప్పి ఏకంగా ప్రజలనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
ఈ షాక్ నుండి పార్టీ నేతలు తేరుకొనే లోపే గుంటూరు పర్యటనలో తీవ్ర అసహనానికి గురయ్యిన బాబు మరింత పరుష పదజాలం వాడి అభాసుపాలయ్యారు . నిన్న గుంటూరు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు మీకు సిగ్గూ రోషం లేదా , గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకొని తిరుగుతారా అని తీవ్ర వ్యాఖ్య చేయడంతో పాటు అమరావతిని సమర్ధించని మీరు బతికున్నా బతికి ఉన్నట్టు కాదంటూ అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం బాధాకరం .
Also Read:“సజ్జల” గురించి తెలుసుకుని మాట్లాడు బాబూ!
టీడీపీ అధికారంలో ఉండగా మిగతా ఎమ్మెల్యేలు , మంత్రుల భాష , వాడుతున్న పదజాలాన్ని విస్మరించి విపక్షాన్ని ఉద్దేశించి వాళ్ళు అలా మాట్లాడకూడదు , ఏం మాటలండీ ఇవి , ఇది పద్ధతి కాదు , అది మర్యాదకర ప్రవర్తన కాదు అంటూ నీతి ప్రవచనాలు చెప్పిన చంద్రబాబు అధికారం కోల్పోయాక వాడుతున్న పదజాలం , ముఖ్యంగా రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తర్వాత అమరావతి ఉద్యమం పేరిట ప్రభుత్వం పై , జగన్ పై పలువురు వ్యక్తుల చేత ఉద్యమం పేరిట తిట్టిస్తున్న తిట్లు మాత్రమే కాక స్వయంగా చంద్రబాబు కూడా సంయమనం కోల్పోయి వాడూ వీడూ అనే సంభోధనలు వాడటంతో పాటు ఏం పీకుతారు , ఏం పీకారు లాంటి పదజాలంతో క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడా బహిరంగంగా వాడని భాషని ప్రచార వేదికలపై , మీడియా సాక్షిగా వాడటం చూస్తుంటే ఓటమి , అమరావతి భూముల విషయాలు తెచ్చిన అసహనంతో పాటు పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కూడా పట్టు కోల్పోతే రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందన్న ఆందోళనకు తోడు స్థానికంగా పార్టీ నేతల్లో కుమ్ములాటలతో సహనం కోల్పోయి మానసికంగా అదుపు తప్పి అధికార పక్షంతో పాటు , తమ ఓటమికి కారణమైన ఓటర్ల పై కూడా పరుష పదజాలం వాడుతున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .