మర్రి రాజశేఖర్. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే. వైఎస్సార్ కి సన్నిహితంగా మెలిగిన వారు ఒకరు. ఆతర్వాత వైఎస్సార్సీపీ ప్రారంభం నుంచి జగన్ వెంట సాగుతున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పట్లో ప్రత్తిపాటి పుల్లారావు చేతుల్లో ఓటమి పాలయినప్పటికీ పార్టీ కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. తీవ్ర ఆటంకాల మధ్య పార్టీ కోసం పనిచేశారు.
అయినప్పటికీ 2019 ఎన్నికల్లో మారిన సమీకరణాల రీత్యా ఆయనకు అవకాశం దక్కలేదు. కానీ అదే సమయంలో విడదల రజనీ కోసం సీటు త్యాగం చేసినందుకు మర్రి రాజశేఖర్ కి తగిన గుర్తింపు ఖాయమని జగన్ హామీ ఇచ్చారు. మండలిలో చోటు కల్పిస్తామని మాట ఇచ్చారు.
జగన్ హామీ ఇస్తే జరిగి తీరుతుందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా పండుల రవీంద్రబాబు, పెన్మత్స సురేష్ కి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడం కూడా అందులో భాగమే.
ఇక గడిచిన ఏడాదిన్నరగా మండలిలో సీటు ఖాళీ అయిన ప్రతీ సందర్భంలోనూ మర్రి రాజశేఖర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన కు అవకాశం ఖాయమనే రీతిలో చర్చ సాగుతోంది. కొన్ని సార్లు ఊహాగానాలతో మర్రి రాజశేఖర్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం కూడా సాగింది. కానీ జగన్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో మర్రి రాజశేఖర్ బెర్త్ విషయంలో జాప్యం చేస్తున్నారు.
చివరకు వచ్చే మార్చి నెలలో దానికి ముహూర్తం ఖారరు చేసినట్టు అంతా భావిస్తున్నారు. మార్చిలో మండలిలో సుమారు 8 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో అత్యధికంగా టీడీపీ నేతలవే ఉన్నాయి. రాబోయే ఏడాదిలో 21 మంది ఎమ్మెల్సీలు రిటైర్ కాబోతున్నారు. అందులో దాదాపుగా 12 సీట్లు వైఎస్సార్సీపీ ఖాయంగా చెప్పవచ్చు. ఇక స్థానిక ఎన్నికలు కూడా పూర్తయితే ఆ కోటాలో మరిన్ని జత అవుతాయి. దాంతో గతంలో హామీ ఇచ్చిన నేతలందరికీ ఒకేసారి ఛాన్సివ్వడానికి మార్గం సుగమం కాబోతోంది.
గవర్నర్ కోటాలో కన్నా నేరుగా పూర్తికాలం కొనసాగే ఎమ్మెల్సీగా పదవి కట్టబెట్టడం కోసం మొగ్గు చూపడం వల్లే మర్రి రాజశేఖర్ కి ఇటీవల అవకాశం రాలేదని చెబుతున్నారు. దాంతో రాబోయే మార్చిలో ఖాళీలు భర్తీ కాబోతున్న నేపథ్యంలో 2021 మార్చి నాటికి మర్రి రాజశేఖర్ మండలి సభ్యుడు కావడం ఖాయమని ఆయన అనుచరులే గాకుండా వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ భావిస్తున్నాయి. ఇప్పటికే దానికి అనుగుణంగా సంకేతాలు రావడంతో మర్రి క్యాంపు మరికొంత కాలం వేచి చూసేందుకు మానసికంగా సిద్దమై ఉన్నట్టుగా చెప్పవచ్చు.