భారతీయ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. మూడేళ్లలో రైల్వే ఆధునీకరణలో భాగంగా గత ఏడాది రైల్వేశాఖ వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. రూ.7.53 లక్షల కోట్ల నిధులతో చేపట్టిన 484 ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో ముగించాలని రైల్వేశాఖ తాజాగా అంచనా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వేశాఖ ప్రయాణీకులకు మెరుగైన సేవలందించడంతోపాటు వస్తు రవాణాలో కీలకంగా మారనుంది. గత ఏడాది కాలంగా ఈ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
రైల్వేశాఖ 51 వేల 165 కిలోమీటర్ల మేర చేపట్టిన 484 ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. ఆధునీకరణలో కొత్తలైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్ పనులు ఉన్నాయి. గత ఏడాదిలో ఆరంభమైన ఈ పనులు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇప్పటికీ 10 వేల 638 కిమీల పొడవునా పనులు జరిగాయని, ఇందుకు రూ.2.14 లక్షల కోట్లు ఖర్చుపెట్టినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్సభలో తెలిపారు.
కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా 187 ప్రాజెక్టులకు 21 వేల 037 కిలోమీటర్ల పొడువునా పనులు చేయాల్సి ఉంది. దీని విలువ రూ.4 లక్షల 5 వేల 591 కోట్ల విలువ. గత మార్చి నెలాఖరు వరకు రూ.ఒక లక్ష ఐదు వేల 591 కోట్ల విలువైన పనులు జరిగాయి. గేజ్ మార్పిడికి వచ్చి మొత్తం 46 ప్రాజెక్టులలో 6,213 కిమీల పొడవునా జరగాల్సి ఉంది. దీని విలువ రూ.53 వేల 171 కోట్లు. ఇప్పటి వరకు 3 వేల 587 కిలోమీటర్ల పొడవునా పనులు జరిగగా, రూ.22 వేల 184 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక డబ్లింగ్ విషయానికి వస్తే మొత్తం 251 ప్రాజెక్టులు 23 వేల 915 కిమీల పొడవునా చేపట్టనుంది. అంచనా రూ.2 లక్షల 93 వేల 471 కోట్లు. వీటిలో ఇప్పటి వరకు 4 వేల 430 కిమీల పొడవున పనులు పూర్తి చేశారు. ఇందుకు రూ.86 వేల 41 కోట్లు ఖర్చు చేసినట్టు రైల్వేశాఖ చెబుతోంది.
రైల్వే చేపట్టిన పనుల్లో కీలకమైంది కాశ్మీర్ లో మరో సొరంగ మార్గం ఏర్పాటు చేయడం. కశ్మీర్ లోని బనిహాల్ సమీపంలో మరో సొరంగ మార్గం పనులు వేగంగా సాగుతున్నాయి. బనిహాల్ నుంచి కరీ వెళ్లే మార్గంలో దీని నిర్మాణం జరుగుతోంది. కాశ్మీర్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో ఇది ప్రధానమైలు రాయి కానుంది. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయినట్టు ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ (ఐఆర్సీఓఎన్) ప్రకటించింది. ఇది కూడా వచ్చే రెండేళ్లలో పూర్తికానుందని వారు తెలిపారు.
Also Read : పోలవరంలో మరో కొర్రీ, ఏకంగా రూ. 15వేల కోట్ల కోత అనివార్యమంటున్న మోదీ సర్కారు