పార్టీ బలోపేతం ధ్యేయంగా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన మూడురోజుల కర్నూలు పర్యటన రెండో రోజుకు చేరింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జ్ లు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఓటమి కి గల కారణాలు విశ్లేషించుకోవడం తో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టిన చర్యలపై చంద్రబాబు చర్చిస్తున్నారు.
ఈక్రమంలో నిన్న దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు దివ్యాంగులకు మొదటి నుంచి టిడిపి ప్రభుత్వం అండగా ఉందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక 600కు పైగా దాడులు జరిగాయని ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలపై దాడులు చేస్తుంటే సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనాలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు చంద్రబాబు.
Also Read : పవన్ చెప్పిన సుగాలి ప్రీతి హత్య కేసును నీరుకార్చింది ఎవరు?
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడుల విషయంలో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసిపి నేతలు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని తమ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదురు తిరిగితే మీరు తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి మా వాళ్ళు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు.
ప్రజల కన్నీరే వైసీపీ ప్రభుత్వానికి శాపంగా మారుతుందన్నారు. జగన్ కు కడప పౌరుషం ఉంటే తన చిన్నాన్నను హత్యచేయించిన వారిని అరెస్టు చేయించాలన్నారు. లా అండ్ ఆర్డర్ తో ఆడుకుంటే మీ పతనం తప్పదని చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు పర్యటనను అడుగడుగున రాయలసీమ విద్యార్థి జెఎసి అలాగే అడ్వకేట్ జేఏసీ నేతలు అడ్డుకుంటూ వస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాట తప్పడం పట్ల నిలదీస్తున్నారు.