మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఈ రోజు పలు చోట్ల ప్రసంగించిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గ్యాస్ ధర వెయ్యి రూపాయలు అయ్యిందని , తాను యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి తీసేశాడని ఈ జగన్ పేదల వ్యతిరేకి అంటూ పలు ఆరోపణలు చేశారు . మద్యం ధరలు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు .
మద్యం ధరలు గురించి చంద్రబాబు పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ వాస్తవానికి మద్యం ధరలు పేదవాడికి అందుబాటులో లేకుండా మద్యం కొనాలంటే కరెంట్ షాక్ కొట్టే విధంగా ధరలు పెంచి మద్యం అందుబాటులో లేకుండా చేస్తాను అని మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే అమలు చేశారు . చంద్రబాబు ఈ అంశాన్ని కూడా వ్యతిరేక కోణంలో భుజానికెత్తుకొని మద్యం ప్రియులను రెచ్చగొట్టటానికి పలు మార్లు విఫలయత్నం చేశారు . ఇహ ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని కేంద్రం ఆధీనంలోని గ్యాస్ ధర పెరుగుదల కూడా జగన్ కు ముడిపెట్టే ప్రయత్నం చేసి ప్రజల్లో పెద్దగా స్పందన రాక అభాసుపాలయ్యారు బాబు .
నిరుద్యోగ భృతి విషయానికొస్తే అసలు వైసీపీ ఆ పథకం ప్రకటించలేదు . పార్టీ మేనిఫెస్టోలో ఆ ఊసు కూడా లేదు . ఈ పథకాన్ని టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి , ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న హామీల్లో ఇది కూడా ఒకటి . అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక బాబు గారు ఇచ్చిన పలు హామీల దారిలోనే నిరుద్యోగ భృతి కూడా అటకెక్కి 2019 ఎన్నికల ప్రక్రియ ముందుగా 2018 డిసెంబర్ లో మళ్లీ బూజు దులిపి ఎన్నికల తాయిలంగా కేవలం ఐదు నెలలు అమలు చేసిన పథకం ఇది . 2014 జూన్ నుండి నిరుద్యోగ భృతి 2000 రూపాయలు హామీని అమలు పరచకుండా 2018 డిసెంబర్ లో 1000 రూపాయలు చొప్పున ఇచ్చి తర్వాత వచ్చిన విమర్శలకు వెరసి 2019 జనవరిలో డిసెంబర్ బకాయి 1000 కలిపి 3000 ఇచ్చి తర్వాత ఏప్రిల్ వరకూ 2000 రూపాయలు చొప్పున ఐదు నెలలు మాత్రమే అమలు చేశారు .
Also Read : చంద్రబాబు గెలవడని పెద్దిరెడ్డికి ఎందుకంత కాన్ఫిడెన్స్.. తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం?
కేవలం 183000 మంది లబ్ధిదారులకు 10000 చొప్పున ఎన్నికల ముందు లబ్ది చేకూరిన పథకం మాత్రమే కానీ దీర్ఘకాలిక పథకం కాదు ఇది . అప్పట్లో ఇది కేవలం ఎన్నికల కోసం ఓటుకు నోటు లాంటి పథకం మాత్రమే అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి . 2018 నవంబర్ లో ఈ పథకం కింద 12 లక్షల 26 వేల మందికి లబ్ది చేకూరుస్తామని టీడీపీ ప్రకటించగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల 85 వేల 313 మంది నిరుద్యోగులు ఆన్ లైన్ లో అప్లై చేసుకున్నారు . అయితే టీడీపీ ప్రభుత్వం తాము ఇస్తామన్న 12.26 లక్షల మందికి కూడా ఇవ్వకుండా , కేవలం 1 లక్షా 83 వేల 585 మందిని మాత్రమే అర్హులుగా ఎంచి వారికి మాత్రమే పథకాన్ని వర్తింపచేసి సాంకేతిక కారణాలు అడ్డం పెట్టుకొని దశలవారీగా పెంచుతామని మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళింది .
ఈ 183585 మందిని ఏ విధంగా ఫిల్టర్ చేశారు అనే రహస్యం అప్పటి జన్మభూమి కమిటీలకే ఎరుక , అప్లికేషన్ ఆన్ లైన్ అయినా కానీ అప్లికెంట్ ఐడీ నెంబర్ తో జన్మభూమి కమిటీ ఇచ్చిన లిస్ట్ మేరకే లబ్దిదారుల్ని ఎంచుకొన్నారని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు , ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేసినా ప్రభుత్వం ఈషన్మాత్రం కూడా లెక్క చేయలేదు . 183585 మందికి ఐదు నెలల కాలానికి బాబు గారు చెల్లించింది 183 కోట్లు 58.5 లక్షలు . బాబు గారు హామీ ఇచ్చిన 2000 చొప్పున 60 నెలల కాలానికి 12.26 లక్షల మందికి సక్రమంగా చెల్లింపులు జరపాల్సింది 14712 కోట్లు (అక్షరాల పద్నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు) . అందులో వారు చెల్లించిన 183 కోట్లు తీసివేయగా 14529 కోట్ల రూపాయల భృతి చెల్లించకుండా బాబు గారు నిరుద్యోగుల్ని వంచించారు .
ఆ తర్వాత 2019 ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా నమ్మని యువత టీడీపీని పక్కన పెట్టిన విషయం తెలిసిందే . ఈ మొత్తం మోసపూరిత తతంగాన్ని వ్యూహాత్మకంగా మర్చిపోయిన చంద్రబాబు నేడు తానిచ్చిన నిరుద్యోగ భృతిని జగన్ ఆపేసాడు అంటూ పేలవమైన ఆరోపణలు చేసి ప్రజల్లో స్పందన లేక అభాసుపాలయ్యారు .
Also Read : కుప్పంపై బాబు ప్రేమ.. వదిలిపెట్టి పోరట..!