పేరుకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. కానీ అధినేతలు చెప్పింది చేయడమే తప్ప ఎప్పుడూ సొంత టాలెంట్ ఉపయోగించలేదు. ప్రెస్ నోట్లు జారీచేయడం, ప్రెస్మీట్లు, సమావేశాల్లో నోరు పారేసుకోవడం.. ఇదే ఆయన ప్రతిభ. అయితే ఇప్పుడు ఆయన విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆ పరీక్ష పెట్టారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు నగరపాలక సంస్థ కూడా ఉంది. అక్కడ ఎన్నికల ఇంఛార్జిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును నియమించడమే కాకుండా.. టీడీపీని గెలిపించుకొని రావాలని టార్గెట్ పెట్టారు. దాంతో అచ్చెన్న అక్కడే మకాం వేసి ఆపసోపాలు పడుతున్నారు. నెల్లూరు వైఎస్సార్సీపీకి బలమైన కోట. అటువంటి చోట టీడీపీని గెలిపించడం దాదాపు అసాధ్యమని ఆ పార్టీ వర్గాలే అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. మరి అచ్చెన్నకు ఎందుకు కష్టసాధ్యమైన టార్గెట్ పెట్టారోనన్న చర్చ జరుగుతోంది.
తలకు మించిన భారం
వైఎస్సార్సీపీకి కంచుకోటల్లాంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించి టీడీపీని అడ్రస్ లేకుండా చేసింది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోనూ అధికార పార్టీకి ఎదురులేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలిచిన ఆపార్టీ.. అదే విజయాన్ని పునరావృతం చేసే దిశగా దూసుకుపోతోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిలు స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పకడ్బందీగా జరిగేలా చూస్తున్నారు. ఏకగ్రీవంగా కొన్ని వార్డులను చేజిక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు టీడీపీకి సరైన అభ్యర్థులే దొరకని దుస్థితి ఉంది. అయితే అన్ని వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాల్సిందేనని చంద్రబాబు పీక మీద కత్తి పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనామకులతో నామినేషన్లు వేయించారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే నాలుగు వార్డులు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఉప సంహరణ గడువు ముగిసేలోపు మరో ఆరు వార్డులు ఏకగ్రీవంగా దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 54 వార్డులు ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థలో టీడీపీని గెలిపించడం అచ్చెన్నాయుడుకు తలకు మించిన భారమేనని ఆ పార్టీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు.
ఎందుకు ఇంత పరీక్ష పెట్టారో..
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత అచ్చెన్నాయుడు ఏ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించలేదు. అసలు ఆయనకు అంత సత్తా లేదు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం టెక్కలిలోనే పార్టీని గెలుపు తీరానికి చేర్చలేకపోయిన ఆయన నెల్లూరులాంటి వైఎస్సార్సీపీ కంచుకోటలో టీడీపీని గట్టెక్కించడం ఎలా సాధ్యం అవుతుందన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన్ను కాదని ఆ జిల్లాతో ఏమాత్రం సంబంధం లేని అచ్చెన్నాయుడును ఇంఛార్జిగా పంపించి.. గెలిపించుకురావాలని లక్ష్యం విధించడం వెనుక వేరే ప్రణాళికలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ టీడీపీ ఓడిపోతే.. దానికి ఆయన్ను బాధ్యుడిని చేసి పక్కన పెట్టాలన్న ఆలోచన అధినేతలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ఎన్నికల్లోనూ.. ఏ నేతకు విధించని టార్గెట్ అచ్చెన్నకు ఇవ్వడానికి అదే కారణం అంటున్నారు. అధినేత ఆదేశాలతో నెల్లూరు వచ్చి మకాం వేసిన ఆయన సోమిరెడ్డి, బీదా రవిచంద్రలో కలిసి ఏవో పాట్లు పడుతున్నారు. అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టడానికే వారి తలప్రాణం తోకకు వచ్చినట్లు అయ్యింది. అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేసి.. పోలింగ్ వరకు పార్టీని పరుగులెత్తించడం నిజంగా అచ్చెన్నకు కత్తి మీద సాములాంటిదే.