ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ భేటీ తర్వాత ఏదయినా జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల వేతన సవరణ జీవోలపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. అదే సమయంలో సినిమా టికెట్ల చుట్టూ పెద్ద వివాదం రాజుకుంది. ఈ రెండు అంశాలకు సంబంధించి క్యాబినెట్ తర్వాత కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని కొందరు ఆశిస్తున్నారు. అయితే రాజకీయంగా క్యాబినెట్ మార్పులు, చేర్పులకు సంబంధించి జగన్ తన మనసులో మాటను వెల్లడించే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించడంలో విజయవంతమయ్యింది. ఆర్థిక పరిస్థితి కలిసిరాకపోయినా కష్టకాలంలోనూ సామాన్యులకు సమస్య రాకుండా చూసింది. తద్వారా ప్రజల్లో తన బలాన్ని చాటుకుంటోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనం. తాజాగా ఇండియా టుడే సర్వేలో కూడా ఏపీలో విపక్షాలు పూర్తిగా బలహీనపడ్డాయనే తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కి 25 పార్లమెంట్ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో చేరే సూచనలున్నాయని తెలిపింది. ఇలా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజాభిమానం నిలబెట్టుకునే దిశలో జగన్ ప్రయత్నాలు మింగుడుపడని విపక్షాలు అనేక వివాదాలు రాజేసేయత్నం చేసినా విజయవంతం కాలేకపోతున్నాయి.
ఈ తరుణంలో క్యాబినెట్ కూర్పు గురించి ప్రమాణస్వీకార సమయంలో చెప్పిన మాటను అనుసరించి నిర్ణయం ఉంటుందని భావించారు. అయితే కోవిడ్ పరిస్థితుల రీత్యా మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేకపోవడంతో ఆచితూచి అడుగులేసే దిశలో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే పూర్తి ప్రక్షాళన కాకుండా కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి, వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో దింపబోతున్నట్టు తెలుస్తోంది. దానికి అనుగుణంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఆచరణలో పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇస్తారా అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీకి సంబంధించిన సినిమా టికెట్ల వివాదం టాలీవుడ్ లోనూ చర్చగా మారింది. సినీ రంగం నుంచి చిరంజీవి రాయబారం కూడా నడిచింది. సీఎం సానుకూలంగా స్పందించారని చిరు మీడియాతో అన్నారు. త్వరలో మంచి నిర్ణయం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సినిమా టికెట్ల వివాదంలో క్యాబినెట్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దానికితోడుగా ఉద్యోగుల పీఆర్సీలో ఫిట్ మెంట్ సహా అన్నింటినీ సంఘాల నాయకులు సీఎం సమక్షంలో అంగీకరించారు. అయితే హెచ్ ఆర్ సీ తగ్గింపుని మాత్రం జీర్ణంచేసుకోలేమని అంటున్నారు. దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తాజాగా హామీ ఇచ్చారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు దురుసుగా మాట్లాడుతున్నప్పటికీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొంత ఊరట కల్పించేలా క్యాబినెట్ లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ రెండు అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. దాంతో ఈ సమావేశం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జగన్