ఆంధ్రప్రదేశ్ లో మరో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు మీద వేటు పడుతుందా లేక ఆయనే రాజీనామా చేస్తారా అనేది ప్రస్తుతానికి తేలాల్సి ఉంది. నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడితే ఆయన ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదు. కాబట్టి రాజీనామాకు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనే వెల్లడించినట్టు వచ్చే నెల మొదటి వారంలో రాజీనామా నిర్ణయం వెలువడుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఈలోగా పార్లమెంట్ లో ఆయన సభ్యత్వం రద్దు దిశగా పరిణామాలు సాగుతున్నాయి. చాలాకాలంగా వివిధ ప్రయత్నాలతో అనర్హత వేటు పడకుండా తాత్సార్యం చేయించినప్పటికీ ఇక తప్పనిసరి అన్నట్టుగా మారింది.
వైఎస్సార్సీపీ తరుపున గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే పార్టీ వ్యతిరేక విధానం అవలంభించారు. పార్టీ నాయకత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద తీవ్రంగా స్పందించారు. పైగా తాను వైకాపా అని, జగన్ తమ నాయకుడేనని ఇలా రకరకాల స్టేట్ మెంట్లు ఇస్తూ స్థాయిని దిగజార్చుకునేలా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యలు, వ్యవహారశైలి రాజకీయాల్లో ఆరంభంలో కొంత ఆసక్తిగా చూసినా రానురాను ఆయన ఆ రెండు చానెళ్ల వారిని ఎంటర్టైన్ చేసేందుకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ పార్లమెంటరీ బృందం పలుమార్లు ఆయన పై ఫిర్యాదు చేసింది. లోక్ సభ స్పీకర్ స్పందించాలని కోరింది.
తాజాగా రఘురామకృష్ణం రాజు మీద అనర్హత వేటు వేసే పిటీషన్ ప్రివిలైజ్ కమిటీకి చేరింది. అక్కడ విచారణ జరగబోతోంది. ఆయనకు నోటీసులు జారీ చేస్తారు. వైఎస్సార్సీపీ తరుపున కూడా తమ వైఖరి వెల్లడించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి ఆధారాలున్నందున వేటు అనివార్యంగా మారింది. తనపై వేటు ఖాయమనే అంశాన్ని నర్సాపురం ఎంపీ ఇప్పటికే గ్రహించారు. పదేళ్ల ప్రయత్నాల తర్వాత చివరకు జగన్ చలువతో లోక్ సభలో అడుగుపెట్టే అవకాశం వచ్చినప్పటికీ దానిని కాలదన్నుకున్నందుకు ఆయన చింతించే సమయం ఆసన్నమయ్యింది.
Also Read : రఘురామకృష్ణంరాజు ఏదో ఆశిస్తే, ఎదురుదెబ్బ తగిలిందా
నర్సాపురం ఉప ఎన్నికలు తప్పనిసరిగా మారుతున్న వేళ, ఇప్పటికే అధికార పార్టీ అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవుతోంది ,వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జిల్లాల విభజన ద్వారా ఇప్పటికే అందరి మన్ననలు ప్రభుత్వం పొందింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆయన పోరాటం నడిపిన ప్రాంతంలో పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేయడం రాజులను బాగా ఆకట్టుకుంది. చాలాకాలంగా క్షత్రియ సంఘాలు దానిని డిమాండ్ చేస్తుంటే చివరకు జగన్ ఆచరణలోకి తీసుకువస్తుండడం సంతృప్తినిచ్చింది.
ఈ పరిణామాలతో రిటైర్డ్ బ్యూరో క్రాట్ బలంగా ప్రయత్నిస్తున్నందున దాదాపుగా వైఎస్సార్సీపీ అభ్యర్థిత్వం ఆయనకు ఖరారయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారా, చేస్తే ఏపార్టీ తరుపున బరిలో ఉంటారన్నది కూడా స్పష్టత లేదు. అందరూ తనకు మద్ధతివ్వాలని మాత్రం ఆయన కోరుతున్నారు. కానీ ఎవరు మద్ధతునిచ్చినా ఆయనకు మాత్రం అవకాశాలు స్వల్పంగా ఉండడంతో ఇన్నాళ్లుగా నమ్ముకున్న చంద్రబాబు సైతం బహిరంగంగా ముందుకు వస్తారా లేదా అనేది కూడా సందేహమే.
Also Read : రఘురామకృష్ణంరాజు తీరుపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు, కేసు నమోదు చేయాలని డిమాండ్
ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల ఓటమి టీడీపీని తీవ్రంగా దెబ్బకొట్టింది. అధికార పార్టీకి దరిదాపుల్లో కూడా లేకపోవడం దానికి కారణం. ఇక బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ శిబిరంలో టీడీపీ నేతలే కీలకంగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు నర్సాపురంలో కూడా తేడా వస్తే టీడీపీ మరింత కుదేలవుతుందనడంలో సందేహం లేదు. దాంతో ఆపార్టీ ఏమేరకు సంసిద్ధంగా ఉంటుందన్నది సందేహమే. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు చావుదెబ్బ తింటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఇక జనసేన దాదాపుగా బలహీనపడింది. బీజేపీ టికెట్ దక్కుతుందా అంటే స్పష్టత లేదు. ఒక వేళ అభ్యర్థిత్వం ఖరారయినప్పటికీ ఆపార్టీకి పునాదులు కూడా లేని ప్రాంతంలో ఇతర ప్రతిపక్షాలను నమ్ముకుని రఘురామకృష్ణంరాజు ఎదురీదగలరా అనేది ప్రశ్నార్థకమే. దాంతో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలని రఘురామకృష్ణంరాజు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవి ఫలించే దిశలో లేనందున ఇప్పుడాయనకు అత్యంత గడ్డుకాలం దాపురించే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : నర్సాపురం ఉప ఎన్నిక వస్తే,వైసీపీ క్యాండిడేట్ ఎవరు?