మగువేగా మగవానికి మధుర భావన అని కవి వాక్కు. ఆ మధుర భావనను వివాహ బంధంతో పదిలం చేసుకొని జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేద్దాం అని మగవారు భావిస్తుంటారు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ట్యాగ్ లైన్ ఉన్నా పెళ్లి కాకుండా మిగిలిపోయినవారు ఎందరో మనకు కనిపిస్తుంటారు. వారినే మనం పెళ్లి కాని ప్రసాదులుగా పిలుస్తుంటాం! అబ్భాయిల కన్నా అమ్మాయిల జనాభా నిష్పత్తి తగ్గిపోవడమే వీరి సంఖ్య పెరిగిపోవడానికి కారణం. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ సమస్య సమాజాన్ని ముఖ్యంగా పెళ్లి కాని ప్రసాదులను ఇబ్బంది పెట్టిందని ఒక అంచనా. అయితే అలాంటి వారి కష్టాలు ఇక గట్టేక్కినట్టే! క్రమంగా మహిళల జనాభా పెరుగుతుండడంతో క్రమంగా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య తగ్గనుంది.
పురుషులను దాటేస్తున్న మహిళల సంఖ్య..
అన్నింటా సగం.. ఆకాశంలోనూ తాను సగం అన్నట్టుగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు సంఖ్యాపరంగానూ పురుషుల్ని దాటేస్తున్నారు. అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు రెండు శాతం అధికంగా ఉండగా.. రాష్ట్రంలో 4.5 శాతం అధికంగా ఉన్నట్టు తాజాగా ఓ సర్వే తేల్చింది.
నాలుగేళ్ల క్రితం నాటి లెక్కలతో పోలిస్తే దేశంలోను, రాష్ట్రంలోను అమ్మాయిల సంఖ్య పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వెయ్యి మంది అబ్బాయిలకు 991 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,020కి పెరిగింది. అయితే, దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమ్మాయిల సంఖ్య వెయ్యి మంది అబ్బాయిలకు 985 మాత్రమే ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెయ్యి మంది అబ్బాయిలకు 1,037 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది.
ఏపీలో ఎక్కువే..
రాష్ట్రంలో 2015–16లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు ఉండగా.. 2019–20లో ఆ సంఖ్య 1,045కు చేరింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1,024 చొప్పున నమోదు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,055 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. కాగా, 2015–16 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2015–16తో పోలిస్తే 2019–20లో అమ్మాయిల సంఖ్య తగ్గింది.
Also Read : థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ సిద్ధమైందిలా..!