దేశంలో కరోనా తీవ్రమవుతున్న సమయంలో ఆక్సిజన్ కొరత అందరినీ వేధిస్తోంది. అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి ఈ ప్రాణవాయువు కొరత ప్రధాన కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ పేరుతో ఉన్న ఓ కంపెనీ స్టాక్ మార్కెట్ లో సంచలనంగా మారింది. బాంబే ఆక్సిజన్ కార్పోరేషన్ షేర్ ధరలు అమాంతంగా పెరగడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే మార్కెట్ లో ఆక్సిజన్ కొరత మూలంగా ఈ కంపెనీ కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందనే అంచనాతో ఎక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేసినట్టు తెలుసుకుని అంతా విస్మయం వ్యక్తం చేశారు.
తీరా చూస్తే సదరు కంపెనీ ఆక్సిజన్ ఉత్పత్తి చేయకపోవడమే కాకుండా ప్రాణవాయువుతో అసలు సంబంధమే లేని ఓ సాధారణ కంపెనీ కావడం విశేషం. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్ ధర ఒక నెల వ్యవధిలోనే 133% పెరిగాయి. కోవిడ్ఎం 19 కేసులు పెరుగుతుండడం, ఆక్సిజన్ కొరత దేశమంతా పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ వైపు మొగ్గుచూపడం గమనార్హం. కానీ బోంబే ఆక్సిజన్ కంపెనీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కావడం విశేషం దాంతో అనేక మంది ఆశ్చర్యపోగా, ప్రస్తుతం స్వల్పంగా ఆ కంపెనీ షేర్లు తగ్గుముఖం పట్టాయి.
ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ కేవలం రూ .350 కోట్లు పెట్టుబడి గల బొంబే ఆక్సిజన్ కార్పోరేషన్ గతంలో ఆక్సిజన్ తయారు చేసి సరఫరా చేసేవారమని ఆర్థిక నివేదికలో పేర్కొంది. 2019 నుంచి అది నిలిచిపోయిందని రాసుకున్నారు. ఆతర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్స్ సంబంధిత వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొన్నారు. దాంతో గత ఏడాది వరకూ కేవలం 10వేల వరకూ ఉన్న ఈ షేర్ ధర హఠాత్తుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏకంగా 25,500కి చేరింది. ఒకవైపు ఫార్మా షేర్లు సహా అనేక కంపెనీల మార్కెట్ ధరలు పడిపోతున్న సమయంలో ఒక్కసారిగా ఈ సాధారణ కంపెనీ షేర్ పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మొన్నటి మార్చి 25 తర్వాత ఈ కంపెనీ షేర్లలో ఒక్కసారిగా కదలిక రావడంతో బొంబే స్టాక్ ఎక్చేంజ్ కూడా కంపెనీ నుంచి వివరణ కోరింది. అయినప్పటికీ చర్చనీయాంశంగా మారిన ఆక్సిజన్ కొరతతో కొనుగోలుదారులు పెద్దస్థాయిలో మొగ్గు చూపారు. ఒక్కసారిగా షేర్ ధర పెరిగిపోయింది. బొంబే ఆక్సిజన్ కార్పోరేషన్ తో పాటుగా నేషనల్ ఆక్సిజన్, భగవతి ఆక్సిజన్, లిండే ఇండియా, మరియు గగన్ ఎయిర్ వంటి కంపెనీల షేర్ ధరలు కూడా కొంతమేరకు పెరగడం విశేషం. దాంతో ఆక్సిజన్ ఆస్పత్రిలో ప్రాణాలు నిలిపడమే కాకుండా షేర్ మార్కెట్ లో బుల్ పరుగులకు తోడ్పడినట్టు కనిపిస్తోంది.