టీడీపీ నుంచి బీజేపీలోకి దూకిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మాటలు వింటుంటే ఆయన పార్టీకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఏదైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అనాలోచిత, ప్రజావ్యతిరేక విధానాలతో రాజ్యాంగాన్నే ప్రభుత్వం బ్రేక్ చేస్తోందన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం వైసీపీ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాదు ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో చేర్చుకునేది లేదని, తగిన సమయం, సందర్భం చూసుకుని చేర్చుకుంటామని సుజనాచౌదరి సెలవిచ్చారు.
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత సుజనాచౌదరి సూక్తులు ఆకాశమే హద్దుగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికై మరో పార్టీలో చేరిన సుజనాచౌదరి ఏ మాత్రం జంకూబొంకూ లేకుండా నీతులు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని తెలుగు ప్రజానీకం అభిప్రాయపడుతోంది.
తామేం చేసినా రాజ్యాంగబద్ధమైనట్టు, ఇతర పార్టీల వారు ఏది చేసినా రాజ్యాంగ వ్యతిరేకమైనట్టు ఆయన మాటలు ఉంటున్నాయంటున్నారు. తాను పార్టీ ఫిరాయించాను కాబట్టి, ఫిరాయింపులనేవి రాజ్యాంగబద్ధమైనవని సుజనాచౌదరి సెలవిచ్చేలా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగానే వైసీపీ, టీడీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతూ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టే ఎత్తుగడలు వేస్తున్నారంటున్నారు. కేంద్రంలో అధికార పార్టీ ఎంపీగా రాష్ట్రనికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన మాని, జగన్ సర్కార్‌పై పెత్తనం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఉడత ఊపులకు తామేమీ బెదిరేవాళ్లం కాదంటున్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడం రాజ్యాంగ విరుద్ధమైతే, జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని బ్రేక్ చేస్తోందని అనుకోవచ్చని సుజనాచౌదరికి వారు సెలవిస్తున్నారు. ఏం చేస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రస్తుతం పాలన సాగిస్తున్న జగన్‌కు తెలుసునని వారు హితవు పలుకుతున్నారు. అది రాజధాని విషయమైనా, మైనార్టీలకు నిధుల మంజూరైనా….సుజనాలాంటి వారితో చెప్పించుకునే దుస్థితిలో జగన్ లేరంటున్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యేక రాజ్యాంగం ఏదైనా ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు.