అవకాశం రాగానే కమలనాథులను హత్తుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. కానీ వారు మాత్రం తమకు దగ్గరగా కూడా రావడానికి వీలు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఛాన్స్ రాగానే బీజేపీ పొత్తులో ఒదిగిపోవాలని టీడీపీ కోరుకుంటోంది. కానీ ఆపార్టీ అంటేనే ససేమీరా అంటోంది బీజేపీ. బాబు వన్ సైడ్ లవ్, ఏకపక్ష మద్ధతు ఎన్ని ప్రకటించినా కుదరదనే చెబుతోంది. దగ్గర కావాలని ఆశిస్తున్న కొద్దీ కుదరదు పొమ్మనే అంటోంది. ఇది టీడీపీ నేతలకు అంతుబట్టడం లేదు. చంద్రబాబుని తీవ్రంగా సతమతం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే తమ గతి ఏమిటన్నది అర్థంకాని విషయంగా మారింది.
చంద్రబాబు ఇటీవల తన శ్రేణులను సన్నద్ధం చేసేందుకు కొత్త దారి వెదుక్కున్నారు. తనవర్గ మీడియా సహాయంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందని పదే పదే చెప్పడం, అదే సమయంలో తమకు అండగా ఇతర పార్టీలు కలిసి వస్తున్నాయని నమ్మించే సంకేతాలు ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు. 2014లో మాదిరిగా జనసేనతో పాటుగా బీజేపీ కూడా ఒకే గూటిలోకి వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. క్యాడర్ ని నమ్మించాలని చూస్తున్నారు. కానీ వాస్తవం వేరుగా ఉండడంతో చాలామంది సీనియర్ నేతలు కూడా సందేహంగానే కనిపిస్తున్నారు. బాబు మాటలను పూర్తిగా నమ్మడానికి సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తోంది.
బీజేపీ పెద్దల కోసం హస్తినలో ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి మరచిపోకముందే ఒక ఫోన్ కాల్ కే పెద్ద ప్రచారం చేసుకునే స్థాయికి రావడం వరకూ చాలామంది టీడీపీ నేతలను కలవరపరుస్తోంది. బాబు తపనే తప్ప బీజేపీ తమను దగ్గరకు రానిచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇటీవల పరిణామాలు కూడా అందుకు ఆధారంగా చెబుతున్నారు. బద్వేలులో బీజేపీ కోరకుండానే టీడీపీ నేతలంతా తగుదునమ్మా అని తయారుగా వెళ్లి మద్ధతు ఇవ్వడం వల్ల ఏం ఒరిగిందనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. బీజేపీలో ఉన్న బాబు అనుచరులు సీఎం రమేష్ వంటి వారు పొత్తుల విషయం అధిష్టానం తేల్చుతుందని సర్థి చెప్పే ప్రయత్నం చేస్తున్నా సునీల్ దియోదర్ వంటి వారు టీడీపీ అంటే అసలు కుదరదని కుండబద్దలు కొడుతుండడం టీడీపీలో కలవరం పుట్టిస్తోంది.
చంద్రబాబు కొంతకాలం పాటు జగన్ వల్ల పాలన జరగదని, కరోనా, ఇతర ఆర్థిక సమస్యల వల్ల చిక్కుల్లో పడతారని ఊహించారు. ఆ తర్వాత జగన్ కేసులను ముందుకు తెచ్చి ఇరకాటంలో పడిపోతారని భావించారు. ఇప్పుడు బీజేపీ తనకు సహాయంగా వస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటికే బాబు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కరోనా సంక్షోభంలో కూడా జగన్ చెప్పిన మాటలను ఆచరించారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక కేసుల విషయంలో జగన్ కి ఇప్పుడే ఎటువంటి సమస్య ఉండదని తేలిపోయింది. దాంంతో బీజేపీ కూడా బాబుని కాదంటే టీడీపీ క్యాడర్ కూడా చంద్రబాబుని విశ్వసించే పరిస్థితి ఉండదు. దాంతో ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా అన్నది టీడీపీని నమ్ముకున్న వారికి అర్థంకాని స్థితి వచ్చింది. ప్రజలతో పాటుగా పార్టీలో కూడా టీడీపీ అధినేత పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో ఇక భవిష్యత్తు ఊహించుకుంటూ చాలామంది నీరుగారిపోతున్నట్టు కనిపిస్తోంది.