మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పరిస్థితులను చక్కదిద్దే చర్యలకు భారతీయ జనతాపార్టీ శ్రీకారం చుట్టింది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, పార్టీపైనా పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించి.. మళ్లీ విజయం సాధించే దిశగా పార్టీని ఎలా సన్నద్ధం చేయాలన్న దానిపై నెలరోజుల నుంచి ఆరెస్సెస్, బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖను సమర్థులైన నేతలతో సంస్కరించి ఎన్నికల టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మోదీ సన్నిహితుడికి కీలక బాధ్యతలు
ఆపరేషన్ యూపీలో భగంగా బీజేపీ రాష్ట్ర శాఖలో పలు నియామకాలు జరిపారు. ఈ మార్పుల్లో ప్రధాని నరేంద్రమోదీ ముద్ర స్పష్టంగా కనిపించింది. మోదీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి ఏ.కె.శర్మను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శర్మ.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణ కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ క్యాడర్ కు చెందిన శర్మ.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన టీములో పనిచేశారు. వైబ్రాంట్ గుజరాత్ వంటి కార్యక్రమాలు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఆ సాన్నిహిత్యంతోనే ప్రధాని అయిన తర్వాత మోదీ అతన్ని తన పేషీలోకి తీసుకున్నారు. గత జనవరిలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాగా శర్మతోపాటు లక్నోకు చెందిన అర్చన మిశ్రా, బులంద్ షహర్ కు చెందిన అమిత్ వాల్మీకీలను పార్టీ ప్రధాన కార్యదర్సులుగా నియమించారు.
సామాజిక సమతుల్యత కోసం
వాస్తవానికి ఏకే శర్మను మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా మంత్రిగా నియమించి కీలక శాఖలు అప్పగించాలని భావించారు. అయితే మంత్రివర్గ మార్పుల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. శర్మను మంత్రిగా తీసుకునేందుకు సీఎం యోగి అంత సుముఖంగా లేకపోవడంతో.. శర్మకు పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించారు. అదీకాకుండా యోగి ప్రభుత్వంలో బ్రాహ్మణవర్గానికి ప్రాధాన్యత తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే వర్గానికి చెందిన శర్మకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా సామాజిక సమతుల్యత సాధనకు ప్రయత్నించారు.
Also Read : చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడగించొద్దని ఆ ఎంపీ లెటర్ ఎందుకు రాశాడు ?