తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి దాకా బీజేపీపై ఒంటికాలితో లేసిన టీఆర్ఎస్ స్పీడును తగ్గించింది. సంక్షేమ పథకాల అమలుపై దృష్టిసారించిన అధికార పార్టీ బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ.. బీజేపీ మాత్రం అదే దూకుడును ప్రదర్శిస్తోంది. అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శలు సంధిస్తూనే ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గ్రేటర్ ఫలితాలతో ఇప్పటికే తన సత్తాను చాటుకుంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలను సైతం తమ గూటికి చేర్చుకుంటూ బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎప్పటిలాగే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి జీహెచ్ఎంసీ నూతన పాలకమండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన బీజేపీ నేతలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బల్దియా ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా పాలకమండలి ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలుబొమ్మగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పోరేటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అదే సమయంలో తాజాగా గెలిచిన పలువురు టీఆర్ఎస్ కార్పోరేటర్లు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కుండబద్ధలు కొట్టారు. కార్పోరేట్లు మాత్రమే కాదు… ఏకంగా రాష్ట్రంలో 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించకూడదనే వారిని తమ పార్టీలో చేర్చుకోవడం లేదన్నారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీ టచ్ లో ఉన్నారా? ఉంటే వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరునున్నట్లు ప్రకటించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సైతం బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలను కలవర పెడుతోంది.
2023లో రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేయడం వెనకగల అసలు మర్మం ఇదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపించే నాటికి భారీగా ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహం పన్నుతోందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయాలనుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.