కోవిడ్ నివారణకు వినియోగిస్తున్న దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఫార్ములాను ఇతర సంస్థలతో పంచుకునేందుకు ఎట్టకేలకు భారత్ బయోటెక్ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి కోవాగ్జిన్ టీకాను బయోటెక్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. దాని ఉత్పత్తి కూడా అదే చేపడుతోంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు వీలుగా టీకా తయారీ సాంకేతిక సమాచారాన్ని షేర్ చేయడానికి మొదట అంగీకరించి వెంటనే మాట మార్చిన బయోటెక్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో దిగివచ్చింది.
మొదట సరే.. తర్వాత ససేమిరా..
కోవిడ్ నియంత్రణకు అభివృద్ధి పరిచిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన పరిశోధనలు, ప్రయోగాల్లో భారత్ బయోటెక్ తో పాటు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవీ) భాగస్వాములయ్యాయి. దీని వినియోగానికి అత్యవసర అనుమతులు లభించిన వెంటనే బయోటెక్ స్వయంగా ఉత్పత్తి చేపట్టింది. అయితే దీని ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం, దేశీయ అవసరాలు అపరిమితంగా ఉన్న పరిస్థితుల్లో కోవాగ్జిన్ ఫార్ములాను ఇతర ఫార్మా సంస్థలకు బదిలీ చేయడం ద్వారా ఉత్పత్తి పెంచాలని సూచిస్తూ ఏపీ సీఎం జగన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. ఆ మేరకు సాంకేతికత బదిలీకి కేంద్రంతో పాటు బయోటెక్ యాజమాన్యం మొదట అంగీకరించింది. అయితే కొద్దిరోజుల్లోనే మాట మార్చింది. కోవాగ్జిన్ ఫార్ములా పూర్తిగా తమ కష్టార్జితమని.. అందులో ప్రభుత్వ సంస్థల సహకారం నామమాత్రమే నన్నట్లు సదరు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సూచిత్ర ఎల్లా కొద్దిరోజుల క్రితం పత్రికా ముఖంగా స్పష్టం చేశారు. ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేదేలేదన్నారు.
కేంద్రం ముకుతాడు
భారత్ బయోటెక్ బెట్టు చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. టీకాల ఉత్పత్తి అవసరమైనంత లేక.. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుండటంతో కేంద్రంపై ఒత్తిడి, విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగి తీవ్ర హెచ్చరికలు చేయడంతో కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ అంగీకరించక తప్పలేదు. ఈ మేరకు భారత్ ఇమ్యునాలజికల్స్ అండ్ బయలాజికల్స్ కార్పొరేషన్, ఇండియన్ ఇమ్యునాలజికల్స్ సంస్ధలతో పాటు మహారాష్ట్రకు చెందిన హాఫ్కిన్స్ అనే ఫార్మా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంది. టీకాల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మూడు సంస్థలకు భారీ ఆర్థిక సాయం అందించనుంది. అయితే కోవాగ్జిన్ ఫార్ములా పొందే ఈ మూడు సంస్థలు ఎప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తాయి.. సాంకేతికత బదిలీ వల్ల భారత్ బయోటెక్ ఏ మేరకు ఆర్థిక ప్రయోజనం పొందుతుందన్న వివరాలు వెల్లడికాలేదు.
Also Read : ఆ ముఖ్యమంత్రి ఏదీ వదిలిపెట్టడం లేదు..!