మల్టీస్టారర్ సినిమాలు తక్కువగా వచ్చే సౌత్ లో ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమాగా ఘర్షణను చెప్పుకోవచ్చు. 1988లో తమిళ్ లో అగ్ని నచ్చతిరం పేరుతో మణిరత్నం ఈ చిత్రం తీశారు. కార్తీక్, ప్రభు హీరోలుగా నిరోషా, అమల హీరొయిన్లుగా చాలా రీజనబుల్ బడ్జెట్ తో రూపొందిస్తే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అప్పట్లోనే 6 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. తెలుగులో భాగ్యలక్ష్మి బ్యానర్ మీద నరసారెడ్డి గారు హక్కులు కొనుగోలు చేసి ఘర్షణ పేరుతో డబ్బింగ్ చేస్తే ఇక్కడా సూపర్ హిట్ అయ్యింది. కొన్ని కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆడింది. కథ విషయానికి వస్తే ఇద్దరు తల్లులద్వారా ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ముల మధ్య నడిచే యుద్ధమే ఘర్షణ.
ఒకరంటే ఒకరికి పడదు. ప్రభు పోలీస్ ఆఫీసర్. కార్తిక్ జులాయిగా రోడ్ల మీద తిరుగుతూ ఉద్యోగం కోసం వెతుక్కునే సగటు మధ్య తరగతి యువకుడు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే తండ్రి మీదకు తనకు కావాల్సిన పని చేయలేదన్న అక్కసుతో విలన్ వీళ్ళ జీవితంలో ప్రవేశిస్తాడు. అప్పుడు బ్రదర్స్ ఇద్దరూ ఒక్కటై వాడి అంతు చూస్తారు. ఇదీ స్థూలంగా స్టొరీ. నిజానికి ఇందులో మరీ గొప్ప మలుపులు ఏమి ఉండవు. చాలా సింపుల్ లైన్. కాని మణిరత్నం తన మేజిక్ నంతా ఎమోషన్స్ ని పండించడంలో చూపించారు. ప్రభు, కార్తిక్ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు రాసుకున్న సన్నివేశాలు థియేటర్లో ఓ రేంజ్లో పేలాయి. భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. తండ్రి చేసిన తప్పుకు పిల్లలు శత్రువులుగా మారడం అనే పాయింట్ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా నచ్చింది.
కామెడీ రిలీఫ్ కోసం పెట్టిన జనకరాజ్ ట్రాక్ అనవసరం అనిపించినప్పటికీ దాన్నీ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఫలితం మెగా సక్సెస్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. రాజా రాజాదిరాజా, నిన్ను కోరి వర్ణం, ఒక బృందావనం పాటలు ఊరూ వాడా హోరెత్తిపోయాయి. రేడియోలలో, టీవీలలో పదే పదే జనం ఎగబడి చూశారు. హోం వీడియోలోనూ ఘర్షణ ఒక సంచలనం. దీని తర్వాత కార్తీక్ రేంజ్ అమాంతం పెరిగిపోగా ప్రభు నాన్న శివాజీ గణేషన్ ప్రభావం నుంచి బయటికి వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అందుకే ఘర్షణ ఇప్పటికే మూవీ లవర్స్ మస్ట్ వాచ్ లిస్టులో చోటు సంపాదించుకుంది.