బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అంశం కలకలం రేపుతోంది. అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణలు లేకపోయినప్పటికీ వేర్వేరు మాధ్యమాలలో ఈ అంశంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేళ ఈ అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బూతద్దంలో చూపుతున్నాయి. కరోనా పరీక్షలు చేస్తున్నట్లే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రక్త పరీక్షలు చేస్తే డ్రగ్ దొంగలు దొరుకుతారంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై ఆరా తీస్తూ అందుకు గల కారణాలను అన్వేషిస్తోంది.
డ్రగ్ దందాలో తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని తేలితే, సీరియస్గా వ్యవహరించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆధారాలు బయటపడిన మరుక్షణం వారిపై బహిష్కరణ వేటు వేయాలని భావిస్తోందట. వారంతా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలేనంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా జరుగుతోంది. దీనిపై టీఆర్ఎస్ అధిష్ఠానం ముఖ్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పూర్తి వివరాలు బయటికి వచ్చే వరకూ వేచిచూసే ధోరణి అవలంబించాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ అధిష్ఠాన శిబిరం దృష్టి పూర్తిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనే ఉంది. అయితే ప్రచారం జరుగుతున్నట్లుగా బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆధారాలు దొరికితే మాత్రం వారిని ఉపేక్షించటానికి పార్టీ పెద్దలు సిద్ధంగా లేరని సమాచారం.
డ్రగ్స్ కేసులో దోషులుగా ఆధారాలు దొరికితే, టీఆర్ఎస్ నుంచి గెంటేసే క్రమంలో సిటింగ్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ గల్లంతు అవుతుందని పార్టీకి చెందిన కొందరు చెప్పుకుంటున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉత్పాదక, అనుత్పాదక రంగాల పురోగతికి, సంపద పెంచడానికి నిరంతరం కష్టపడుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టబడులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటుంటి ప్రచారం రావడాన్ని అధిష్ఠానం సీరియస్గా పరిగణిస్తోంది. నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కొందరు ప్రజలను పట్టించుకోకుండా వ్యాపారాలు, వ్యాపకాల పేరిట పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి తెలంగాణకు తలవంపులు తేవటం దారుణమని మరికొందరు అభిప్రాయం పడుతున్నారు. దీంతో బెంగళూరు డ్రగ్స్ కేసు పురోగతిపై అధికార, విపక్ష పార్టీల్లో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో మున్ముందు ఎటువంటి విషయాలు బయటికి రానున్నాయో వేచి చూడాల్సిందే.