పార్టీ పట్ల నమ్మకంతో, విధేయతతో ఉంటూ చిత్తశుద్ధితో పనిచేసేవారికి తప్పనిసరిగా గుర్తింపు ఇస్తామని ఇచ్చిన భరోసాను నామినేటెడ్ పదవుల భర్తీ ద్వారా వైఎస్సార్సీపీ ఆచరణలో పెట్టింది. దానికి ఉదాహరణగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన బల్లడ కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన మాజీ ఎంపీపీ హేమామాలినీ రెడ్డి ఏపీ మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మహిళల కోటాలో ఆమెకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి లభించడం విశేషం.
తొలి నుంచి పార్టీలోనే..
రాజకీయ కుటుంబానికి చెందిన బల్లడ హేమామాలినీ రెడ్డి, ఆమె భర్త జనార్ధనరెడ్డి పార్టీ ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ లోనే ఉన్నారు. హేమామాలినీ పెద్దమామ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. జనార్ధనరెడ్డి 2001 నుంచి 2005 వరకు ఎచ్చెర్ల ఎంపీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎంపీపీ అధ్యక్షురాలిగా ఎన్నికైన హేమామాలినీ వైఎస్సార్సీపీ ఏర్పాటైనప్పుడు పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచి దంపతులు ఇద్దరూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు.
రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ కోసం నిలబడ్డారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన హేమామాలినీ వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. జెడ్పీటీసీగా విజయం సాధిస్తే జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవి లభిస్తుందని ఆశించారు. కానీ అధిష్టానం ఆమె ఆశలకు మించి ఉన్నత అవకాశం కల్పించింది. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ అధ్యక్ష పదవి ఇచ్చింది. పార్టీ పట్ల విధేయంగా ఉన్న వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయని హేమామాలినీ నియామకం రుజువు చేసింది.
Also Read : పోరాట ఫలం.. ఆ మహిళా నేతకు పీఠం
రెడ్డిక సామాజికవర్గానికి గుర్తింపు
నామినేటెడ్ పదవుల నియామకాల్లో జగన్ ప్రభుత్వం బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో గణనీయ సంఖ్యలో ఉన్నా తగిన గుర్తింపునకు నోచుకోని బీసీ కేటగిరీకి చెందిన రెడ్డిక సామాజికవర్గానికి ఏకంగా మూడు పదవులు ఇచ్చింది. మహిళా సహకార ఆర్థిక సంస్థకు హేమామాలినీ రెడ్డితో పాటు ఇదే సామాజిక వర్గానికి చెందిన సాడి శ్యాంప్రసాద్ రెడ్డిని ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి పదవుల్లో నియమించారు. అంతకు ముందు కులాలవారీగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు రెడ్డిక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా దక్కత లోకేశ్వరరెడ్డిని నియమించారు.
నలుగురు మహిళామణులు
నామినేటెడ్ పదవుల్లో శ్రీకాకుళం జిల్లాకు ఏడు లభించగా.. వాటిలో నాలుగు మహిళలకే లభించడం విశేషం. బల్లడ హేమామాలినికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి లభించగా.. నరసన్నపేటకు చెందిన కోరాడ ఆశాలతను కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) అధ్యక్ష పదవి వరించింది. ఆశాలత ఇంతకు ముందు నరసన్నపేట వార్డు సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త కోరాడ హరిభూషణ గుప్తా నరసన్నపేట సర్పంచిగా పనిచేశారు. ఆమదాలవలస నియోజకవర్గ సీనియర్ నేత సువ్వారి గాంధీ కుటుంబానికి చెందిన సువ్వారి సువర్ణను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలిగా నియమించారు. అలాగే ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన సల్ల సుగుణకు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పదవి ఇవ్వడం ద్వారా జిల్లా మహిళలకు జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది.
Also Read : ఇచ్ఛాపురం.. మూడు పదవుల వరం