కడప జిల్లాలో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మరణించారు. కొంతకాలంగా కాన్సర్తో బాధపడుతున్న డాక్టర్ వెంకటసుబ్బయ్య ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గడిచిన ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు,దీనితో కడప జిల్లాలో విషాదం అలముకుంది.
బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో జగన్ పులివెందుల మునిసిపల్ కమిషనర్గా పనిచేసిన తిరువీధి జయరాములును ఉద్యోగానికి రాజీనామా చేయించి వైసీపీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే ఆ తర్వాత టీడీపీ ప్రలోభాలతో జయరాములు పార్టీ ఫిరాయించారు.
ఈ నేపథ్యంలో బద్వేలులోనే వైద్యుడిగా గుర్తింపు ఉన్న గుంతోటి వెంకట సుబ్బయ్యను 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తెరమీదకు తెచ్చింది. గతంలో బద్వేల్ జనరల్ సీటుగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆశీస్సులతో ఆయన బరిలో దిగారు. 44,734 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థిని ఓడించి అసెంబ్లీలో అడుగపెట్టారు. అయితే రెండేళ్ళు కూడా నిండకుండానే ఆయన మృత్యువాతపడడం అందరినీ కలచివేస్తోంది.ఆ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవటంతో బీజేపీ తరుపున పోటీ చేసిన జయరాములు కేవలం 730 ఓట్లతో ఏడవస్థానంలో నిలిచారు.
61 సంవత్సరాల వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్స్ లో మంచి నిపుణులు. ఎస్వీ మెడికల్ కాలేజీలో పీజీ చదివారు. భార్య, ముగ్గురు బిడ్డలున్నారు. ఎమ్మెల్యేగా సౌమ్యుడిగా,వివాదరహితుడిగా పేరున్న ఆయన కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పలు చోట్ల చికిత్స అందించినా కోలుకోలేకపోయారు. ప్రస్తుతం కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
గడిచిన రెండేళ్లలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపార్టీకి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందగా ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన స్థానంలో కుమారుడు ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి బద్వేల్ తో పాటుగా కడప జిల్లా వాసులను విషాదంలో నింపింది.
వెంకటసుబ్బయ్య మృతికి సీఎం వైఎస్ జగన్ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు బద్వేలులో నిర్వహిస్తారని సమాచారం.