నాకు జలుబు చేసింది. వైరస్ సోకిందేమో. నేను ఇప్పుడు ఏమి చేయాలి. టెస్ట్ ఎక్కడ చేయించుకోవాలి. అప్పటి వరకూ ఏమీ కాదు కదా.. ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండాలా..? ఇది గ్రామీణ ప్రజానీకం పట్టణాల్లో ఉన్న తమ వాళ్లకు ఫోన్ చేసి అడుగున్న ప్రశ్నలు. వైరస్ సోకడం అవమానం అనే భావన పట్టణ, గ్రామీణ ప్రాంతాలల్లో దాదాపు పూర్తిగా పోయింది. పరీక్షలు చేయించుకునేందుకు, చికిత్స తీసుకునేందుకు, తమకు వైరస్ లక్షణాలు ఉంటే స్వఛ్చందంగా ముందుకు వస్తున్నారు. అయితే ఏది వైరస్, ఏది కాదు.. వస్తే ఏమి చేయాలి..? ఎవరిని సంప్రదించాలి..? అనే అవగాహన కొరవడింది. ఫలితంగా గ్రామీణ ప్రజానీకం ఆందోళనలో ఉంది.
వర్షాకాలం మొదలైంది. సీజనల్ వ్యాధులు విజృంభించే కాలం కూడా ఇదే. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరాలు.. ఈ సమయంలో సర్వసాధారణం. సాధారణ జ్వరాలతోపాటు డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు ప్రజలను అతలాకుతలం చేసే రోజులివి. దీనికి తోడు కరోనా వైరస్ కాచుకుకూర్చుంది. జలుబు చేసినా హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అంతా ప్రస్తుతం ఆర్ఎంపీల ద్వారానే నడుస్తోంది. ప్రస్తుత కరోనా సమయంలో చికిత్స అందడం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి జగన్ సర్కార్ ఏర్పాటు చేసే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు గ్రామీణ వైద్యానికి ఇబ్బంది ఉండదు.
అయితే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు సవివరంగా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వారిలో అనవసర ఆందోళనలు తగ్గడమే కాక.. వైరస్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరస్‌పై అవగాహన కల్పించేందుకు విసృత్త ప్రచారం కల్పించాలని వారం రోజుల కిందటే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ పని ఇంకా ప్రారంభం కానుట్టుంది. పట్టణ ప్రాంతాలతోపాటు ముఖ్యంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
దేశంలో ఏ రాష్ట్రానికి లేని వ్యవస్థ, మానవ వనరులు ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటరీ విధానాల వల్ల ఉన్నాయి. ప్రభుత్వం తాను అనుకున్న పని ఏదైనా సరే గంటల వ్యవధిలో పూర్తి చేసే సత్తా ఈ వ్యవస్థల ద్వారా లభించింది. అందుకే ఏ రాష్ట్రం కూడా చేయలేని విధంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో ఇంటింట సర్వే మూడు సార్లు చేపట్టారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలి. రెండు వేల మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో ఒక హెల్త్ అసిస్టెంట్ ఉన్నారు. సదరు ఉద్యోగి, ఏఎన్ఎం, వాలంటీర్‌తో కలిపి ఓ బృందంగా ఏర్పడి గ్రామాల్లో పతి ఇంటికి వెళ్లాలి. సీజనల్ జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి..? కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో సవివరంగా చెప్పాలి. అదే సమాచారం కరపత్రంపై ముద్రించి పంచాలి. గోడ పత్రికలు గ్రామాల్లో అతికించాలి. ఈ పని కేవలం రెండు మూడు రోజుల్లో ప్రతి గ్రామంలో పూర్తి చేయవచ్చు. సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చి వారం దాటిన నేపథ్యంలో ఇక యంత్రాంగం వేగంగా కదలాల్సిన అవసరం ఎంతో ఉంది.