ల్జయనగరం జిల్లా రామతీర్థం ఆలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థం శ్రీ రాముడి విగ్రహం ధ్వంసం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలయిన వైసిపి,టీడీపీ,బీజేపీ నేతలు రామతీర్థం శ్రీరాముడి ఆలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రామతీర్థం మెట్లమార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి వెళ్లారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో రామతీర్థం ఆలయానికి చేరుకున్నారు.టీడీపీ శ్రేణులతో పాటు బీజేపీ నేతలు కూడా అక్కడకు చేరుకోవడం అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం కొండపైకి వెళ్లబోయే క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సహాయంతో విజయసాయిరెడ్డి కొండపైకి చేరుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి తిరుగు ప్రయాణంలో టీడీపీ, బీజేపీ నేతలు విజయసాయిరెడ్డి వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన వాహనంపై రాళ్లు చెప్పులతో దాడికి దిగారు.
ఈ క్రమంలో ఆయన వాహనంపై రాళ్ళ దాడి కారణంగా కారు అద్దం పగిలిపోయింది. దీంతో విజయసాయిరెడ్డి కారు దిగి పోలీసుల సహకారంతో నడుచుకుంటూ వెళ్లి మరో కారులో బయలుదేరి వెళ్లారు. కాగా విజయసాయిరెడ్డి కారుపై దాడి జరగడాన్ని వైసీపీ శ్రేణులు ఖండించాయి. మూడు ప్రధాన పార్టీల శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని శాంతి భద్రతలకు విఘాతం కల్పించొద్దని విజయనగరం ఎస్పీ రాజకుమారి కోరారు.