ఒకప్పుడు తెలుగుదేశానికి పట్టుగొమ్మగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ జిల్లాకు చెందిన వ్యక్తినే నిలబెట్టినా అక్కడ కూడా టీడీపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన అనంతరం ఉత్తరాంధ్ర మొత్తం వైఎస్సాఆర్ సీపీ హవా కొనసాగుతోంది. ఏళ్ల తరబడి వెనుకబడి ఉన్న ఆ ప్రాంతం అభివృద్ధిపై స్థానికుల ఆశలు చిగురించడంతో అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విశాఖ రాజధాని కాబోతున్న తరుణంలో ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా నియమిస్తే స్ధానికంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్రలో పునర్ వైభవం సాధించేందుకు కూడా వీలు పడుతుందని చంద్రబాబు భావించారు. అది కూడా ఇప్పుడు తలకిందులవుతోంది. విశాఖకు ఆయనే స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న శ్రీకుళం జిల్లాలో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
ఇప్పుడు తాజాగా జిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నేత కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు మొత్తం పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఆయన ఏకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపైనే ఆసక్తికర ఆరోపణలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితికి రావడానికి చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు అంటే ఏపీ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడిగా పేరు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పార్టీని వీడుతున్న ప్రతి ఒక్కరూ బాబు వీక్నెస్ లపై దెబ్బకొడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లాకే చెందిన అచ్చెన్నాయుడుపై కూడా రామ్మోహన్ రావు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు రిగ్గింగ్తోనే గెలిచారని ఆయన ఆరోపించారు.
వరుస కేసులు, సొంత పార్టీ నేతలే ఆరోపణలు, వరుస ఎన్నికల్లో ఓటమిలతో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రం మొత్తం టీడీపీని బలోపేతం చేస్తా.. మళ్లీ అధికారంలోకి తెస్తా.. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అచ్చెన్నాయుడు ఇప్పుడు జిల్లాలోనే పార్టీని కాపాడుకోలేక సతమతం అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే టీడీపీలోకి భారీగా వలసలు సాగాయి. ఏకంగా ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్ధులే వైసీపీ జెండా కప్పుకున్నారు. ఇది ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు రామ్మోహన్ రావు రాజీనామాతో వలసల పర్వం మొదలైంది. ఏ పార్టీలో చేరేది అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. టీడీపీకి కీలక నేతలు దూరం కావడం, మరోవైపు వైసీపీ బలపడుతుండడంతో శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ ఉనికి కష్టంగా కనిపిస్తోంది.