మరో ఏడు నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. మూడో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అన్నా డీఎంకే ఇప్పటి నుంచి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తమ పార్టీలో ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించుకుంటోంది. ఏడపాపడి పళనిస్వామి(ఏపీఎస్), ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ల మధ్య నిన్నటి వరకూ ముఖ్యమంతి అభ్యర్థిత్వంపై కొనసాగిన వివాదం తాజాగా సద్దుమణిగింది. అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఏపీఎస్‌ను ఎన్నుకున్నారు. ఈ రోజు బుధవారం ఓపీఎస్, ఏపీఎస్‌లు సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై సెప్టెంబర్ 28 అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఏపిఎస్ఎ, ఓపిఎస్ లు వాగ్వాదానికి దిగడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. ఇద్దరు నేతలు సీఎం ఛాన్స్‌కోసం వాదులాడుకోవడంతో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు విస్తుబోయారు. ఈ ఘటన తర్వాత ఓపిఎస్ ముఖ్యమంత్రి ఏపీఎస్ కు దూరమయ్యారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజర య్యారు. ఇలా అలకపాన్పు వహించిన ఓపీఎస్‌ను బుజ్జగించేందుకు సీనియర్ మంత్రులు ఆయన నివాసంలో పలు విడతలుగా జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి.
234 సీట్లు గల తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2016 మేలో జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ విజయం సాధించింది. వరుసగా రెండోసారి అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకొచ్చిన జయలలిత తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఏడాదికే ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. జయలలిత పీఠం కోసం ఏపీఎస్, ఓపీఎస్లు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఆ తర్వాత జరిగిన చర్చల్లో ఏపీఎస్ సీఎంగా, ఓపీఎస్ డిప్యూటీ సీఎంగా పదవులు తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సరైన నాయకత్వం లేని అన్నాడీఎంకే ఈ సారి ఎన్నికల్లో చెమటోడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరో వైపు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ అధినేత స్టాలిన్ తొలిసారి ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు. రాబోవు ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి తొలిసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొవాలని ఉవ్వీళ్లురుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన డీఎంకే మొత్తం 39 సీట్లలో సొంతంగా 24 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 8 సీట్లలో నెగ్గింది. అన్నా డీఎంకే ఒక్క సీటుకే పరిమితమైంది. మిగిలిన 6 సీట్లు ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.