మద్యం అక్రమ రవాణ… ఇసుక అక్రమ సరఫరా.. వంటి వాటిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సూచనలతో ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సత్ఫలితాలు ఇస్తోంది. జగన్ ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో ఆ టీమ్ ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపుల నియంత్రణ, మద్యం, ఇసుక అక్రమ నిల్వలను విశేషంగా అరికడుతోంది. మద్యం, ఇసుకకు సంబంధించి కొన్ని లోటుపాట్లు తన దృష్టికి వచ్చినప్పుడు సీఎం జగన్ ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కు నాంది పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన ఈ బ్యూరో దాడులతో కేవలం ఏడు వారాల వ్యవధిలోనే 20 వేల కేజీలకు పైగా గాంజను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాదు.. భారీ ఎత్తున అక్రమ మద్యం పట్టుకున్నారు. అక్రమ ఇసుక నిలువలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఆనుకొని ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి అక్రమ మార్గాల్లో.. పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మద్యాన్ని గుర్తించి.. దానిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఎవరి మాటా వినరు…!
జగన్ ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో.. అవినీతి కేసులకు సంబంధించి ఎవరి మాటనూ లెక్క చేయడం లేదు.. అక్రమం అని తేలితే.. ఎంతటి వారి నుంచైనా ఇసుక లేదా మద్యం స్వాధీనం చేసుకుంటోంది. చివరకు వైసీపీ నేతలకు చెందిన వారైనా సరే.. అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే.. వదిలేది లేదని తేల్చి చెబుతోంది. ఇది జగన్ ఇచ్చిన ఆదేశాలని నిర్భయంగా వెల్లడిస్తోంది. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా.. వారి బెదిరింపులకు లొంగకుండా.. మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిలో తీవ్రమైన కృషి చేస్తోంది. మద్య నియంత్రణ దిశగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ బెల్టు షాపులను అరికడుతోంది. ఈ బ్యూరో ఏర్పాటైయిన తర్వాత లక్షల లీటర్ల కల్తీ సారా ధ్వంసం చేసింది. సారా బట్టీలపై దాడులు పెరిగాయి. గ్రామాల్లో కల్తీ సారా అడ్డుకట్టకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.