రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంతో రైతులకు చక్కటి ఊతం అందిస్తోంది. ఈ రకంగా సాగుకు సాయం అందిస్తూ వారి ఇంట నిజమైన వెలుగులు నింపుతోంది. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే రైతుభరోసా, పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా వారికి అండగా నిలుస్తున్నారు.
దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవసాయానికి వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తున్నారు. ఇంధన శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉచిత విద్యుత్తును సక్రమంగా అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ముఖ్యంగా వ్యవసాయానికి విద్యుత్‌పై ఇంధన శాఖ అధికారులతో సీఎం, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తోంది.
ఏటా 12 వేల మిలియన్ యూనిట్లు ఉచితంగా..
రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.8,400 కోట్లు ఖర్చు చేస్తోంది. పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన 3–ఫేజ్ విద్యుత్ సరఫరాకు 6,663 వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరచడానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది.
ప్రస్తుతం యూనిట్ రూ.4.39కు కొంటున్నారు. రానున్న 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను కొనసాగించడానికి వ్యయాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే ఇస్తోంది. దీనివల్ల ఏటా దాదాపు రూ.3,230 కోట్లు ఆదా అవుతుంది. ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీని వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు విద్యుత్తును ఏ ఆటంకాలు లేకుండా అందిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పినట్టు వ్యవసాయం దండగ కాదు పండగ అని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిరూపిస్తున్నారు. అన్నదాతలు కూడా ఉచిత విద్యుత్తు హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
Also Read : మీ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది – సీఎం జగన్ కు కైకాల లేఖ