మొదటినుండి ఆంధ్రులు ఆరంభసూరులు అనే నింద మోస్తున్నాం. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర విడిపోవడం, విడిపోయిన రాష్ట్రానికి రాజధానిగా తెలుగు నగరం చెన్నపట్నం (మద్రాస్)ను కోల్పోవడం, ఆ తర్వాత కర్నూలును అభివృద్ధి చేసుకోకుండానే హైదరాబాద్ నగరానికి పరుగెత్తడం మన చారిత్రక తప్పిదాలు. వాటినిప్పుడు ఏమీ చేయలేము. కోల్పోయిన వాటిని పొందలేం. కనీసం ఉన్నవాటినైనా కాపాడుకోగలుగుతున్నామా అనేది పెద్ద ప్రశ్న. కాపాడుకోవడమే కాదు, ఓ తరం ముందుకెళ్ళి అప్పటి పరిస్థితులను ఆవిష్కరించుకొని ఆ దిశగా పనిచేస్తున్నామా అన్నది కూడా పెద్ద ప్రశ్నే.
హైదరాబాద్ తో ఆంధ్ర కలవడానికి అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రా లోనూ చాలామందికి ఇష్టం లేకున్నా కొందరు పెద్దలు కర్నూలును బలి ఇచ్చి హైదరాబాద్ కు పరుగెత్తారు. ఆ తర్వాత 60 యేళ్ళపాటు తెలంగాణ వాదం వినిపిస్తున్నా ఏమీ వినిపించనట్టే పాలన చేశాం. తెలంగాణ వేర్పాటు వాదాన్ని తొక్కిపెడుతూ, హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం చేసి మిగతా తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినట్టు కనిపించాం. అయితే ఆ మేరకు సీమాంధ్రను అభివృద్ధి చేసుకోలేకపోయాం.
2014 జూన్ 2న విభజన జరిగే సమయానికి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణాలో వరంగల్, కరీంనగర్ ప్రాంతాలను విస్తృతంగా అభివృద్ధి చేశాం కానీ ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం వరంగల్, కరీంనగర్ స్థాయి నగరాలు అభివృద్ధి చేసుకోలేకపోయాం. విశాఖపట్నం కూడా కేంద్ర సంస్థల కారణంగా అభివృద్ధి చెందిందే తప్ప మన పాలకులు చేసిందేమీ లేదు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది అని చెప్పుకునే విజయవాడ నగరంలో ఉన్న రెండు రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోలేకపోయాం.
మనం వ్యక్తపరిచే ఆవేశం లేదా ఆగ్రహం ఇతర ప్రాంతాల ప్రజల ఆవేశాలు, అగ్రహాలతో సమంగా ఉండదు. చాలా సందర్భాల్లో ఉమ్మడి ఆలోచన విస్మరించి గొర్రెల్లా దేనివెంటో పరుగెత్తుతూ ఉంటాం. ఈ విషయం అర్ధం చేసుకోడానికి చరిత్రలోకి దశాబ్దాల తరబడి వెళ్ళనవరసం లేదు. ఈ దశాబ్దకాలంలో జరిగిన రాష్ట్ర విభజన ఉద్యమం చదివితే మనం మెదడుకు పనిచెప్పకుండా ఎవరి ఆలోచనలకో బానిసవుతూ ఉంటాం అని తేలిగ్గానే అర్ధమవుతుంది.
రాష్ట్ర విభన అనివార్యం అన్నప్పుడు మనకు ఏం కావాలో అడగకుండా, మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించకుండా జై సమైక్యాంధ్ర అంటూ ఉద్యమించాం. విలువైన కాలాన్ని, అత్యంత విలువైన వనరుల్ని పోగొట్టుకున్నాం. కనీసం 1956కి ముందునాటి ఆంధ్ర రాష్ట్రం కూడా అడగలేక పోయాం. ఇప్పుడు కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిన్నటితో యేడాది ముగిసింది అని సంబరాలు చేసుకున్న అమరావతి ఉద్యమం మరో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పునర్ముద్రిస్తోంది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్టీ రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారు కానీ అమరావతిలో ఏం కావాలో, భూములిచ్చిన వారికి ఏం కావాలో, 29 గ్రామాలకు ఎలాంటి సదుపాయాలు కావాలో అడగడం మర్చిపోతున్నాం. “విభజన వద్దు – సమైక్యాంధ్రే ముద్దు” అని నినదించి పోరాటం చేసి భంగపడ్డా మనం గుణపాఠం నేర్వలేదు. ఇప్పుడు కూడా “మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు,” అంటూనో “ఒకే రాష్ట్రం ఒకే రాజధాని” అంటూ మరో సమైక్యాంధ్ర పోరాటంలాంటిది చేస్తూ అదేదో గొప్పగా చెప్పుకుంటున్నాం.
విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర అంటూ విఫల ఉద్యమం నడిపిన శక్తులే ఇప్పుడు అమరావతి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నాయి. ఈ శక్తులను గుడ్డిగా అనుసరిస్తూ మనకు ఏం కావాలో, అమరావతిలో ఏం ఉండాలో అడగడం మానేశాం. “హై కోర్టు పెడితే కర్నూలుకు ఏమొస్తుంది రెండు ఫొటోస్టాట్ కొట్లు, ఒక టీ దుకాణం తప్ప” అంటూ విమర్శ చేస్తూనే హై కోర్టు అమరావతి నుండి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే అమరావతికి రెండు ఫొటోస్టాట్ కొట్లు, ఒక టీ దుకాణం సరిపోతాయా? అవే చాలా? అందుకే ఆంధ్రులు ఆరంభసూరులే కాదు ఆలోచన చేయడం మానేసినవారు అని కూడా అనాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించింది లేదు. అమరావతికి ఏం కావాలో, అమరావతిలో ఏం ఉండాలో నిర్ణయించుకొని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పగలిగితే సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. అలా కాకుండా మరో సమైక్యాంధ్ర ఉద్యమంలా అమరావతి ఉద్యమాన్ని నడిపించదలచుకుంటే మరో యేడాది ఉద్యమం చేసుకున్నా సమస్య పరిష్కారం కాదు.