అవసరం ఉన్న వారికి చేతనైతే చేయందించి సాయం చేయాలి.. చేసేవారిని చూసి శభాష్ అని మెచ్చుకోవాలి.. అంత మనసు లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగానీ ఆపన్న హస్తంపై ఆరోపణలు చేయడం.. మంచి కార్యక్రమాలను అడ్డుకోవడం ఉత్తమం కాదు.. రాజకీయ ధర్మం అంతకన్నా కాదు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షం అలాంటి రాజకీయాలే చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. అధికారంలో చేసిన ఇలాంటి తప్పుల వల్లే ప్రజలు 23 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఆ సంఖ్య మరింత తగ్గుతోంది. అధినేత నిర్ణయాలతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రజల నిరసనలను ఎదుర్కోలేక కొంత మంది ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. అయినప్పటికీ తీరు మారని చంద్రబాబు అండ్ కో ఇప్పటికీ అదే పంథా అవలంబిస్తోంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలతో ఈ విషయం స్పష్టమవుతోంది.
నిరసన సెగలు మరచిపోయారా..?
ఏపీ సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయన ప్రజలలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. ప్రతిపక్షమైన టీడీపీ ఏం చేయాలో పాలుపోక.. కొన్ని పథకాలు అమలు కాకుండా మోకాలడ్డుతోంది. కోర్టు కేసుల ద్వారా వాయిదాలు పడేలా చేస్తోంది. ఇళ్ల స్థలాలు ఇంత వరకూ రాకపోవడానికి టీడీపీ నేతల చలవేనని గ్రహించిన ప్రజలు తిరుగుబాటుకు తెరలేపారు. లబ్దిదారులు ఆందోళన బాట పట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారన్న విషయాన్ని గ్రహిస్తున్న లబ్దిదారులు ఆందోళన బాట పడుతున్నారు. గతంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి నిరసన సెగ గట్టిగానే తగిలింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని నల్లమిల్లి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంతో తామంతా సంతోషంగా ఉన్నామని, అడ్డుకుంటే ఊరుకునేది లేదని ఆయన ఇంటికి వెళ్లి మరీ హెచ్చరించారు. మీరు ఇవ్వలేదు.. ఇచ్చేవారని అడ్డుకుంటారా..? అని ప్రశ్నించారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా నిరసన సెగ తప్పలేదు. అమరావతి లోనే ఆయన తీరుపై విమర్శలు వెల్లువెల్లుతున్నాయి. అలాగే సంక్షేమ పథకాలు అడ్డుకోవడంపై చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఇద్వా (ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్) గతంలో భారీ ర్యాలీని నిర్వహించింది.
అయినా ఇప్పుడూ అదే పంథా…!
ఏపీలో చారిత్రక కార్యక్రమం కొనసాగుతోంది. ఇళ్ల స్థలాల పంపిణీ శరవేగంగా జరుగుతోంది. పేదల కల నెరవేరబోతోంది. 15 రోజుల్లో లక్షలాది మందికి పట్టాలు అందజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలందరూ కృషి చేస్తున్నారు. ఇవన్నీ ప్రతిపక్ష నేతలకు మింగుడు పడడం లేదు. టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసురాని చంద్రబాబు.. ఇప్పుడు జగన్ ఆ పని చేస్తుంటే.. విమర్శలు చేస్తున్నారు. అవినీతి జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నేతల తీరుతో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. అయినప్పటికీ జగన్ సార్.. ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు.. అనవసర ఆరోపణలు, రాద్దాంతాలు చేసి అడ్డుకోవద్దని కోరుతున్నారు. మీరు మంచి చేయకపోయాని ఎలాగోలా బతికేస్తాం.. కానీ కీడు తలపెట్టొద్దని కోరుతున్నారు. మరో వైపు ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగితే టీడీపీ నేతలు నిరూపించవచ్చని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.
కేసులు ఉపసంహరించుకుంటారా..?
‘అమరావతిలో పేద వారికి ఇల్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అన్నది మీరు కాదా. మీకు చిత్త శుద్ధి ఉంటే.. ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ కేసును ఉపసంహరించుకోండి. పేదలకు ఇళ్ళు ఇద్దాం.ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం… సామాజిక స్థితి పెరుగుతుంది… అది మీకు ఇష్టం లేదా…? ఈ ఇళ్ల కోసమే కదా ఆందోళనలు చేసింది. ఒక ముఖ్యమంత్రి నేను ఇస్తాను అంటే వ్యతిరేకిస్తారా. కనీసం ఇలాంటి పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు అయినా అభినందలు తెలపండి. ఇళ్ల పట్టాలపై స్టే తెచ్చిన వారంతా ఉపసంహరించుకోండి. లేదంటే మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు. మీరు రైతులను బెదిరించి భూములు తీసుకున్నారు…మా జగన్ గారు చట్టప్రకారం 2013 యాక్ట్ ప్రకారం సేకరించారు.’ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.