ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నూతన విత్తన విధానం (సీడ్ పాలసీ) తీసుకొచ్చింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలు సకాలంలో రైతులకు అందజేయడమే ఈ విధానం ఉద్దేశం. ఈ సీడ్ పాలసీతో రైతులకు భరోసా, భద్రత లభిస్తాయి.
మరింత మేలు..
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 92.45 లక్షల ఎకరాల్లో, రబీ సీజన్లో 58.65 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ పంటలకు 22.81 లక్షల క్వింటాళ్లు, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు 72 వేల క్వింటాళ్లు, ఉద్యాన పంటలకు 1.20 లక్షల క్వింటాళ్లు కలిపి మొత్తం 24.79 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. ఇందులో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ 9.20 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు కంపెనీలు 11.33 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి చేస్తున్నాయి. రైతు సంఘాలు 3.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు తయారు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏటా సుమారు రూ.1,500 కోట్ల విలువైన విత్తన వ్యాపారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల వల్ల రాష్ట్రంలో విత్తన కష్టాలకు తెరపడింది. దీనికితోడు ఇప్పుడు విత్తన పాలసీ వల్ల మరింత మేలు జరగనుంది.
రైతుల భాగస్వామ్యంతో
విత్తనోత్పత్తి
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రస్తుతం 450 గ్రామాల్లో 2 వేల మంది రైతులు 15 రకాల పంటలకు సంబంధించి 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. విత్తన పాలసీ ద్వారా కొత్తగా మరో 1,000 గ్రామాల్లో 5వేల మంది రైతుల ద్వారా 20 రకాల పంటలకు సంబంధించి 12 లక్షల క్వింటాళ్ల ఫౌండేషన్, సర్టిఫైడ్, హైబ్రిడ్ విత్తనాలు ఉత్పత్తి చేయనున్నారు. దశలవారీగా కనీసం 10 వేల మంది రైతుల ద్వారా 2వేల గ్రామాల్లో 15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఇందుకు 15-20 మంది సభ్యులతో రైతు సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించనున్నారు. తయారైన విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో ధృవీకరిస్తారు.
Also Read : ఏపీలో ఆ పథకం తెచ్చిన మార్పులు ఏమిటి..?
మూల విత్తన మార్పిడికి ప్రణాళికలు
హైబ్రీడ్ పంటల మూల విత్తనాన్ని ఏటా మార్చేలా ప్రణాళికలు తయారు చేశారు. వరి, శనగలు, మినుములు, పెసలు, వేరు శనగలు, మొక్కజొన్న, జొన్న, పత్తి మూల విత్తనాన్ని 2023-24కు నూరు శాతం మార్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న 18 ప్రాసెసింగ్ యూనిట్లకు తోడు కొత్తగా 33 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
విత్తన జన్యు కేంద్రం ఏర్పాటు..
రూ.50 కోట్లతో విత్తన జన్యు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందేళ్ల నాటి విత్తనాలతో పాటు డిమాండు ఉన్న విత్తన రకాల మూల విత్తనం నుంచి మేలు జాతి విత్తనాలు ఇక్కడ తయారు చేస్తారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ స్టోరేజ్ పద్దతుల్లో 3 నుంచి 50 ఏళ్ల వరకు మూల విత్తనాన్ని విత్తన జన్యు కేంద్రంలో భద్రపరుస్తారు.
విత్తన పాలసీ లక్ష్యాలు..
జన్యుపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మేలు జాతి విత్తనాలు అభివృద్ధి చేస్తారు. విత్తనోత్పత్తిలో రైతులను ప్రోత్సహిస్తారు. నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతారు. అధిక దిగుబడి సాధించే వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తారు. విస్తృత స్థాయిలో విత్తన పరిశొధనలు నిర్వహించడమే కాక విత్తనోత్పత్తి అవసరమైన వారికి శిక్షణ ఇస్తారు.
రైతుల ఆనందం..
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విత్తన పాలసీని రైతులు స్వాగతిస్తున్నారు. విత్తు నుంచి విపణి వరకు తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా తమ సంక్షేమం కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నారు.
Also Read : Jagananna Vidya Deevena – Vasathi Deevena – ఈ రెండు పథకాలు.. యువత భవితకు జోడు చక్రాలు