ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్యంతో ఉన్న తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలిచాలని ఆదేశాలివ్వాలంటూ అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. అచ్చెం నాయుడు తరఫు న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అచ్చెం నాయుడును ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏ ఆస్పత్రికి అనేది స్పష్టత లేదు.
ఈ నెల 1వ తేదీన అచ్చెం నాయుడును గుంటూరు సర్వజన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేయడంతో ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరుసటి రోజే తనకు ఆరోగ్యం బాగోలేదని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని అచ్చెం నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. గత శుక్రవారం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదికను అందించేందుకు సమయం ఇచ్చింది. సోమవారం ప్రభుత్వ తరఫున న్యాయవాది అచ్చెం నాయుడు ఆరోగ్యంపై నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ పిటిషన్పై తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ఆ మేరకు ఈ రోజు అచ్చెం నాయుడును ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని తీర్పు వెల్లడించింది.
గత నెల 13వ తేదీన ఈఎస్ఐ స్కాంలో అచ్చెం నాయుడను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఫైల్స్ ఆపరేషన్ వల్ల గుంటూరు జీజీహెచ్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 1వ తేదీన డిశ్ఛార్జి అయ్యారు. తాజా తీర్పుతో అచ్చెం నాయుడకు భారీ ఊరట లభించనట్లేనని చెప్పవచ్చు.