వైసీపీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇతర టీడీపీ నేతల నోళ్లు మూతపడేలా 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తాజా, మాజీ అధికారులతోపాటు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పితాని వెంకట సురేష్ దాఖలు చేసిన ముందసు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 13వ తేదీన కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్‌పై స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆయనకు డబ్బులిచ్చినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో ఔషధ సరఫరాదారులు వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కేసులో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ఏసీబీ వాదనలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక స్థితిగతులు, వ్యవస్థపై ప్రజల విశ్వాస్నా ప్రభావితం చేస్తాయనే దాంట్లో సందేహమే లేదని జస్టిస్ కె. లలిత వ్యాఖ్యానించారు.
కార్మికులకు అందాల్సిన వైద్యంలో అక్రమాలకు పాల్పడి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలతో ఏసీబీ చర్యలు చేపట్టగా.. నిందితుల పక్షాన టీడీపీ వింత వాదన చేస్తోంది. కులం కార్డు ఉపయోగిస్తూ.. నిందితులను వెనకేసుకొచ్చేలా వ్యవహరిస్తోంది. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అణచివేస్తున్నారంటూ బొడిగుండుకు మోకాలికి ముడిపెట్టి వాదనలు చేసింది. చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీ మాజీ మంత్రులకు వరకూ ఇదే వాదన చేస్తున్నారు. కానీ తమ నేతలు అవినీతి చేయడంలేదని మాత్రం చెప్పడంలేదు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు చెంపపెట్టులా మారాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్‌ను కూడా త్వరలో ఏసీబీ అరెస్ట్ చేస్తుంది. ఆ సమయంలో కూడా బీసీ కార్డు ఉపయోగిస్తూ టీడీపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తారా..? లేదా తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు గుర్తుపెట్టుకుని మిన్నుకుండిపోతారా..? వేచి చూడాలి.