దూరదృష్టితో రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలకు దేశవ్యాప్తంగా అభినందనలు దక్కుతున్నాయి. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను, రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)ల పనితీరును.. నీతీ ఆయోగ్, ఆర్బీఐలు మెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విద్యారంగంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు జాతీయ స్థాయిలో అభినందనలు లభించాయి.
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చాలా బాగున్నాయని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), ఇతర రాష్ట్రాల విద్యా రంగ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ చర్యలతో పాఠశాల విద్యలో అద్భుతమైన ఫలితాలు సుసాధ్యమని చెప్పారు. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్కుపై ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇటీవల దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల విద్యా విభాగాల ప్రతినిధుల రెండు రోజుల శిక్షణ సదస్సు ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రభుత్వ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో వివరించారు.
రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలవుతున్న అమ్మ ఒడి పథకంతో డ్రాపవుట్లు పూర్తిగా తగ్గి, చేరికలు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో పాఠశాలల రూపురేఖలనే మార్చివేసేలా నాడు – నేడు కార్యక్రమాలు అమలు చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సదుపాయాలు సమకూర్చడం గొప్ప విషయమని మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) ప్రతినిధులు చెప్పారు.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చేయడం, ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్ సంస్కరణలతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, పేద వర్గాల పిల్లల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్సీఈఆర్టీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి రాకముందే రాష్ట్రంలో పునాది విద్యను బలోపేతం చేయడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచిందన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపడుతున్న పలు సంస్కరణలను, అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకున్నారు.
Also Read : ఇక తెలంగాణ సర్కారీ బడుల్లోనూ ఇంగ్లీష్ మీడియం..