ఏపీ మాజీ ముఖ్యమంత్రిగా విశేష అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబుకి అదేమీ అక్కరకు వచ్చినట్టు కనిపించడం లేదు. అనువుగాని సమయంలో అధికులమనరాదనే విషయం ఆయన మరచిపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కలిసిరాని కాలంలో కూడా కయ్యానికి సై అంటే ఏమవుతుందో ఇప్పటికే విదితమయినా ఆయనకు బోధపడుతున్న దాఖలాలు లేవు. దాంతో పదే పదే ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే యత్నంలో ఆయన ఇక్కట్లు కొనితెచ్చుకుంటున్నారు.
ఆ క్రమంలోనే ఆయన ముప్పేట దాడితో మల్లగుల్లాలు పడుతున్నారు
వాస్తవానికి 2019 ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకి పెద్ద గుణపాఠం. కానీ ఆయన పాఠాలు చెప్పడానికే తానున్నాననే భ్రమలో పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు. దాంతో ఇప్పటికీ జగన్ మీద నిందా ప్రచారంతో నలుగురినీ మెప్పించగలమని ఆశిస్తున్నారు. ఎల్లకాలం అలా చెల్లదనే సంగతిని విస్మరిస్తున్నారు. 2014 మంత్రాన్నే 2019లో జపించారు. చిన్న చిన్న మార్పులతో అవే ప్రచార అస్త్రాలుగా చేసుకుని బోర్లా పడ్డారు. ఇప్పటికీ కూడా జగన్ చుట్టూ తిరుగుతూ, జనాలను మరచిపోతున్నారు. పైగా యూటర్న్ బాబూ అంటూ పార్లమెంట్ గా వేదికగానే ఆయన గురించి చేసిన ప్రస్తావనలకు అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ప్రజల్లో మరింత పలుచన అవుతున్నారు. పట్టు సాధించే అవకాశాలను కోల్పోతూ పార్టీని పీకల్లోతు సమస్యల్లోకి నెట్టుకున్నారు.
ప్రస్తుతం చంద్రబాబుకి రాజకీయంగా కలిసిరావడం లేదు. అందుకు బాహ్య పరిస్థితులు ఒక కారణం అయితే చంద్రబాబు స్వయంకృతాపరాధం కూడా ఉంది. కేంద్రంలో మోడీ ఏపీలో జగన్ , తెలంగాణాలో కేసీఆర్ సర్కారు ఏకకాలంలో బాబుని కలవపరస్తున్నాయి. అదే సమయంలో ఏపీలో సంస్థాగతంగానూ టీడీపీ సమస్యల్లో ఇరుక్కుంది. పార్టీలో సీనియర్లు దాదాపుగా సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు తీరుతో అనేకమంది మౌనం పాటిస్తున్నారు. మిగిలిన వారిలో ప్రజాబలం లేనివారే ఇప్పుడు మీడియాలో బాబుని మోయాల్సిన అఘాయిత్యం ఏర్పడింది. అదే సమయంలో సొంతబలం కుచించుకుపోతున్న సమయంలో మిత్రపక్షాల సాయంతో నెట్టుకురావచ్చనే బాబు మార్క్ ట్రిక్ ఇప్పుడు రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుతో స్నేహానికి అందరూ దూరమవుతున్నారు. ప్రస్తుతం బాబు వెంట కేవలం సీపీఐ రామకృష్ణ తప్ప ఇతర పార్టీ నేతలెవరూ లేరనే చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పక్షాన చేరారు. ఆపార్టీ విధానాలను జవదాటలేని స్థితిలో జనసేనాని పడ్డారు. ఇక బీజేపీని మచ్చిక చేసుకోవాలనే బాబు ప్రయత్నాలు కొలిక్కిరావడం లేదు. రెండేళ్లు దాటుతున్నా దగ్గరకి చేరనివ్వడం లేదు. ఎన్నోమార్లు వేడుకున్నా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా బీజేపీ నేతలు వేధిస్తున్నారు. ఓవైపు జగన్ దూకుడు కారణంగా ఏపీలో పార్టీ పతనావస్థలో ఉందనే ప్రచారం కారణంగా బాబు కలవరపరడుతుంటే మరోవైపు రాజకీయ పరిస్థితులు దినదినగండంగా మారుతున్నారు. అన్నింటికీ మించి చంద్రబాబుకి ఇన్నాళ్లు బలం అనుకున్న మీడియా పరిస్థితి కుడితిలో పడ్డ బల్లిలా మారింది. అందరికీ శకునాలు చెప్పిన ఈనాడు, జ్యోతి మార్క్ కహానాలు ఇప్పుడు నడవడం లేదు. ఎంత పెద్ద ఆరోపణలు అల్లినా వాటిని జనం తేలికగా తీసుకుంటున్నారు. దాంతో బాబు బలం ఇప్పుడు బలహీనపడిపోయిన అస్త్రంగా మారిపోయింది. బ్రహ్మాస్త్రం కాస్తా బేలతనంతో నిండిపోవడంతో బాబుకి ఊపిరిసలపడం లేదు.
ఈక్రమంలో కరోనా కారణంగా ఏకంగా ఆరు నెలలు రాష్ట్రానికి దూరంగా ఉండిపోవడం వయసు రీత్యా బాబుకి అనివార్యం. కానీ కొడుకు లోకేశ్ కూడా కలిసిరాకపోవడంతో బాబు సొంత జనంలో కూడా విశ్వాసం కోల్పోతున్నారు. కనీసం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా ఇలాంటి సమయంలో జనాలకు చేరువకాగలిన అవకాశాన్ని బాబు తనయుడు చేజార్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చివరకు సొంత సామాజికవర్గం కూడా బాబు నాయకత్వం మీద నమ్మకం కోల్పోయే దశకు చేరుకుంది. తాజాగా అమరావతి ఎపిసోడ్ లో నేనేమీ చేయలేనన్నట్టుగా చేతులెత్తేసిన తీరు, స్వర్ణా ప్యాలస్ వ్యవహారంలో బాబు మార్క్ తెరవెనుక రాజకీయాలు ఉపయోగపడకపోవడంతో చివరకు డాక్టర్ రమేష్ తెరమరుగుకావాల్సి రావడం చాలామంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇక బాబు వల్ల ఏమీ కాదనే అబిప్రాయానికి అనేక మంది వచ్చేస్తుండడంతో టీడీపీ పునాదులు వేగంగా కదులుతున్నాయనే చెప్పాలి.
వాటికితోడుగా ఈసారి అధికార యంత్రాంగం కూడా చంద్రబాబుని కలవరపెడుతోంది. గతంలో ఆయన మరోసారి అధికారంలోకి వస్తారనే భయంతో కాస్తయినా కొందరు అధికారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు నేరుగా కౌంటర్ వేస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు లేఖ రాస్తే ఏపీ డీజీపీ కౌంటర్ రాయడం గమనిస్తుంటే అదికార యంత్రాంగంలో కూడా విపక్ష నేతకు పూర్తిగా పట్టు లేనట్టుగానే భావించాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు శెల్యూట్ చేసిన వారే ఇప్పుడు తిరిగి సమాధానం చెబుతుంటే చంద్రబాబు జీర్ణం చేసుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు చంద్రబాబుని మానసికంగా కుంగతీసే అవకాశం కనిపిస్తోంది. ముప్పేట దాడి ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన వయసు కూడా సహకరించే అవకాశంలేదు. ఇది ఆయన గతంలో ఎన్నడూ ఊహించనిది. బాబు అనుచరులు అసలు అనుకోనిది. దీని నుంచి గట్టెక్కడం, ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం బాబు వల్ల కాదనే విషయం పలువురు గ్రహిస్తున్నారు. క్రమంగా బాబు ప్రతిష్ట మసకబారిపోతున్న తరుణంలో టీడీపీ పరిస్థితి కూడా తెల్లారుతున్నట్టుగానే భావించాలనే బ్యాచ్ పెరుగుతోంది. చూద్దాం..ఏమవుతుందో