ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సిబ్బంది వేతన సవరణల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పీఆర్సీల కోసం కమిషన్ నియామకాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వేతన సవరణల సంఘం అంచనాలనే ఏపీ ప్రభుత్వ సిబ్బందికి కూడా అమలుచేసేందుకు పూనుకుంటామని చెబుతున్నారు. దాంతో ఇది కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. 1960ల నుంచి వేతన సవరణ సంఘం నియామకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 11వ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ వెలుగుచూసింది. ఇక భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఏపీకి వర్తింపజేసేలా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోబోతుండడంతో పలుమార్పులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
ప్రస్తుతం చివరి పీఆర్సీ అమలు చేసేందుకు సీఎస్ నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను సీఎం జగన్ కి అందించింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 27 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదిస్తూ రిపోర్టుని పరిశీలించిన అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితితో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మొత్తం 11 ప్రతిపాదనలతో నివేదిక సీఎంకి అప్పగించారు. నూతన పీఆర్సీ పరిధిలోకి వార్డు, గ్రామ సెక్రటరీలను, హోంగార్డులను, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందినీ తీసుకురావడం విశేషం. గతంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటుగా హోంగార్డులకు కూడా వేతనాల విషయంలో పీఆర్సీ వర్తింపజేయాలనే డిమాండ్ ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం వారిని కూడా పీఆర్సీ పరిధిలోకి తీసుకురావడంతో నిర్ధిష్ట కాలపరిమితిలో వేతనాల పెరుగుదలకు ఆస్కారం లభించింది.
Also Read : ఫిట్మెంట్ ఎంతో చెప్పిన సీఎస్ శర్మ
సీఎస్ కమిటీ రిపోర్ట్ ప్రకారం కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించారు. అత్యధిక వేతనం 1.79 లక్షలు ఉండేలా ప్రతిపాదన చేశారు. పదిలక్షలు పైబడిన నగరాల్లో ఉంటున్న వారికి హెచ్ఆర్ఏ 20 నుండి 22 శాతానికి పెంచారు. సిటీ అలవెన్స్ విజయవాడ విశాఖలో నాలుగు వందల నుండి 1000కి, మిగిలిన 12 మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 300 నుండి 750కి ప్రతిపాదించారు. గ్రాట్యుటీని రూ.12 లక్షల నుండి రూ.16 లక్షలకు పెంచారు. ఫుల్‌టైమ్, కంటింజెంట్, డైలీవేజ్, కన్సాలిడేటెట్, ఎన్‌ఎంఆర్‌లకు 20 వేలతోపాటు డిఏ అమలు చేయాలని కూడా నివేదించారు.
11 ప్రతిపాదనలతో పాటు 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తే రూ. 11,557 కోట్లు, 27 శాతం ఇస్తే రూ. 13,422 కోట్లు అదనంగా ప్రభుత్వానికి భారం అవుతుందని పేర్కొన్నారు. దేశంలోనే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉద్యోగుల జీతభత్యాల వ్యయం ఉన్నందున దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని రిపోర్టులో పేర్కొన్నారు. అత్యల్పంగా 14.29 శాతం ఫిట్ మెంట్ తో పాటు హెచ్ఆర్ఏ, అదనపు పెన్షన్‌ను ఏడవ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం అమలు చేస్తే రూ.9150 కోట్లు భారం పడుతుందని తెలిపారు. దాంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏమేరకు తుది నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశం అవుతోంది. సీఎస్ కమిటీ చెప్పినట్టుగా కేవలం 14.29 శాతానికే పరిమితం అవుతారా లేక ఐఆర్ అందిస్తున్నట్టుగానే అత్యధికంగా 27 శాతం ఫిట్ మెట్ ని సూచించిన నేపథ్యంలో దానిని అమలు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారుతోంది. మూడు రోజుల్లోగా సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని ఈనెల 20 లోగా పీఆర్సీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
Also Read : సీఎం చేతిలో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఉత్కంఠ..
అయితే ఫిట్ మెంట్ 14.29 శాతం విషయం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణాలో అధికారుల సంఘం 13 శాతం ప్రతిపాదిస్తే సీఎం దానిని మరింతగా పెంచిన నేపథ్యంలో ఏపీలో కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని , దానికి తగ్గట్టుగానే తుది నిర్ణయం ఉంటుందనే ఆశాభావం ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది.