ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలు నగరంలో న్యాయరాజధాని ఏర్పాటునకు జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. దానికి అనుగుణంగా తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కర్నూలులో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం ప్రారంభించాని జగన్ సంకల్పించారు. కానీ హైకోర్టు స్టే విధించడంతో అది జాప్యం అవుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి లోకాయుక్త కార్యాలయం ఏపీకి తరలించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో జగన్ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం చేసింది.
త్వరలోనే కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటు చేయాలని జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దాంతో పాటుగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా కర్నూలులో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. కర్నూలుని న్యాయరాజధాని అంటే హైకోర్టు వచ్చినంత మాత్రాన ఏమిటి ఉపయోగం అంటూ గతంలో కొందరు వ్యాఖ్యానించారు. కానీ న్యాయరాజధాని అంటే కేవలం హైకోర్టు మాత్రమే కాదని, న్యాయసంబంధిత విభాగాలన్నీ అక్కడికే తరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దానికి అనుగుణంగానే ప్రస్తుతం లోకాయుక్త, హెచ్ ఆర్ సీ లను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే ఈ రెండు కార్యాలయాలను కర్నూలులో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కర్నూలుకి కొత్త కళ ఖాయంగా చెప్పవచ్చు. కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉన్న కార్యాలయాలు ఏపీ గడ్డ మీద కర్నూలు కేంద్రంగా అడుగపెట్టడం రాయలసీమ వాసులతో పాటుగా రాష్ట్ర ప్రజలందరినీ సంతృప్తిపరిచే విషయంగా చెప్పవచ్చు. ఇక త్వరలో విశాఖలో పాలనా కేంద్రానికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేసి తరలింపునకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. దాంతో జగన్ ప్రణాళికాబద్ధంగా మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
Also Read : లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్