కరోనా తగ్గిపోతోంది జన జీవనం సాధారణమైపోయిందని సంతోషపడుతున్న తరుణంలో యుకెలో మొదలైన కోవిడ్ వెర్షన్ 2 ఇప్పుడు ప్రపంచమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండియాకు వచ్చిన భయమేమీ లేదని పాలకులు హామీ ఇస్తున్నప్పటికీ వీటిని నమ్మడానికి లేదు. ఇంతకు ముందు కూడా ఇలాగే ఏవేవో మాటలు చెప్పి తర్వాత కట్టుదిట్టం చేశారు. కాబట్టి జనం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సినిమా పరిశ్రమ మీద ఇప్పుడీ పరిణామం తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్న భారీ చిత్రాల మీద.
తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ని జనవరి నుంచి వేసవికి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యుఎస్ లో పరిస్థితి తీవ్రంగా లేనప్పటికీ ఒకవేళ అక్కడికి చేరుకున్నాక వస్తే మాత్రం యూనిట్ మొత్తం అమెరికాలోనే చిక్కుబడి పోవాల్సి ఉంటుంది. పైగా చేయడానికి పని ప్లస్ వనరులు అలాంటివి ఏమి ఉండవు. కనీసం హైదరాబాద్ ఉంటే అయినా ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది. అందుకే అన్నీ ఆలోచించి సర్కారు వారి పాట ఫారిన్ షెడ్యూల్ ని వాయిదా వేసే ఆలోచన చాలా సీరియస్ గా జరుగుతున్నట్టు సమాచారం. మహేష్ కూడా ఎస్ అనొచ్చు.
ఇదొక్కటే కాదు దీని ఎఫెక్ట్ అందరి మీద పలుకోణాల్లో ఉండబోతోంది. మార్చ్ దాకా ఈ వైరస్ మహమ్మారి, వ్యాక్సిన్ గురించి క్లారిటీ వచ్చేలా లేదు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప నిజంగా సామాన్యుడు ఎప్పుడు దాన్ని అందుకోగలడనే దాని మీద స్పష్టత రావడం లేదు. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ తో పాటు బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలు 2021లో విడుదల కావడం గగనమే. ఇప్పటికే తీవ్ర సంక్షోభంతో అల్లాడిపోతున్న పరిశ్రమకు ఇవి ఏ మాత్రం మంచి చేసే పరిణామాలు కాదు. అసలు ఈ సంవత్సరమే ఇంత దారుణంగా ఉంటుందని ఎవరైనా ఊహించారా. ఈ వారం రోజులు ఎప్పుడు అయిపోతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు.